తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి తొలినుంచి వ్యతిరేక భావంతోనే ఉన్న కిషన్రెడ్డి రాష్ట్ర అధ్యక్షస్థానం నుంచి దిగిపోతూ కూడా తన మాట నెగ్గించుకునే ప్రయత్నమే చేసి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడుగా మూడుసార్లు పదవిని అధిష్టించిన కిషన్రెడ్డి దిగిపోయే ముందు నిర్వహించిన చివరి కార్యవర్గ సమావేశం తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకోవడానికే సంకేతాలు ఇవ్వడం, తెదేపాతో మైత్రికి కటీఫ్ చెబితే తప్ప.. తెలంగాణలో తమ పార్టీకి కనీసం పూర్వపు వైభవ స్థితికి చేరుకోవడంసాధ్యం కాదని చర్చలు సాగడం రాబోయే పరిణామాల్ని తెలియజెబుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో తెదేపా, భాజపాలు స్నేహపూర్వక పార్టీలుగా మాత్రమే ఉంటాయి. వారి మధ్య పొత్తు మాత్రం ఉండదు. అనే అధికారిక ప్రకటన ఒక్కటే వెలువడాల్సి ఉంది. ఇంచుమించుగా అంతే అర్థం ఇచ్చేలా ‘2019 ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ఒంటరిగానే పోటీచేస్తుంది’ అని కేంద్రమంత్రి దత్తాత్రేయ స్వయంగా మీడియా ముఖంగా ప్రకటించడం చాలా కీలకంగా కనిపిస్తోంది.
చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆపద్ధర్మ పరిస్థితుల దృష్ట్యా కుదుర్చుకున్న పొత్తు తప్ప.. ఈ రెండు పార్టీల మధ్య సిద్ధాంత సారూప్యత ఎంతమాత్రమూ లేదు. తెలంగాణలో పార్టీ నాయకత్వానికి తొలినుంచి ఇష్టం కూడా లేదు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఎన్ని రకాల అసంతృప్తుల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ.. తెలుగుదేశం పార్టీతో పొత్తు వలన తాము చాలా మేరకు నష్టపోయామనే భావనకు వచ్చింది. తెలుగుదేశం పని ముగిసిపోయిందని.. వారితో జట్టుకట్టడం, సీట్లు పంచుకోవడం వలన తమ అవకాశాలకు తామే పాతర వేసుకుంటున్నామని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల్లో ఈరెండు పార్టీలు విడివిడిగానే పోటీచేశాయి గానీ.. ఎవ్వరూ ఏమీ సాధించలేకపోయారు. నిజానికే అప్పుడే కటీఫ్ సంకేతాలు వచ్చినట్లు లెక్క. ఇప్పుడు దత్తాత్రేయ స్వయంగా ప్రకటించడతో.. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మిత్రపక్షాలుగా ఉండాల్సిందే తప్ప.. తెలంగాణలో ఎవరి దారి వారిదే అని అంతా అనుకుంటున్నారు.