ఏపి, తెలంగాణా రాష్ట్రాలలో భాజపా నేతలు ఇంచుమించు ఒకే సమయంలో తెదేపా పట్ల తమ అయిష్టతను వ్యక్తం చేస్తూ మాట్లాడటం విశేషం. రెండు రాష్ట్రాలలో అది, సోమవారాలలో జరిగిన పార్టీ కార్యనిర్వాహకసభ్య సమావేశాలలో మాట్లాడిన భాజపా రాష్ట్ర నేతలు అందరూ తెదేపాకి మిత్రపక్షంగా కొనసాగడం వలన తమ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఇదేదో కాకతాళీయంగా జరిగిన సమావేశాలు కావు…యధాలాపంగా చెప్పిన అభిప్రాయాలు కావు. రెండు రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షుల మార్పు జరుగబోతున్న తరుణంలో జరిగిన సమావేశాలు కనుక వాటికి చాలా ప్రాధాన్యత ఉంది. దానిలో పాల్గొన్న భాజపా సీనియర్ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు తెదేపాతో తెగతెంపుల ప్రక్రియని లాంచనంగా ప్రారంభించినట్లు భావించవచ్చును.
విజయవాడలో నిన్న జరిగిన భాజపా కార్యవర్గ సభ్యుల సమావేశంలో, రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఏమీ చేయడం లేదనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, కేంద్రం అందిస్తున్న సహాయసహకారాలు, నిధుల గురించి పూర్తి వివరాలతో ప్రజలలోకి వెళ్లి వారికి వివరించాలని భాజపా నేతలు నిర్ణయించారు. ఈనెల 12-24వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దీని కోసం ర్యాలీలు, సభలు నిర్వహించాలని భాజపా నేతలు నిర్ణయించారు. అవసరమయితే సంబంధిత కేంద్రమంత్రులను కూడా రప్పించి వారి చేతనే ఏపికి కేంద్రం అందిస్తున్న సహాయసహకారాల గురించి ప్రజలకు వివరింప జేయాలని రాష్ట్ర భాజపా నేతలు నిర్ణయించారు.
కనీసం వచ్చే ఎన్నికల వరకు రెండు పార్టీలు కలిసి ప్రయాణిస్తాయని అందరూ భావించారు కానీ ఇంకా ముందుగానే ‘కటీఫ్’ చెప్పుకోవడానికి సిద్దం అవుతున్నట్లున్నాయి. అయితే ఈ ప్రక్రియని పూర్తి చేయడానికి రెండు పార్టీలు మరికొంత సమయం తీసుకోవచ్చును. దానికి అవసరమయిన రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఏర్పడేలోగా, రెండు పార్టీలు రాష్ట్రంలో కుల, రాజకీయ సమీకరణాల లెక్కలు సరిచూసుకొంటూ, తమ తమ బలాలను పెంచుకొనే ప్రయత్నాలు చేయవచ్చును. ఇప్పటికే తెదేపా కాపులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మురం చేసింది. ఆ చేత్తోనే వైకాపా ఎమ్మెల్యేలకు కూడా గాలం వేస్తూ, వాళ్ళు భాజపా ఎరకి చిక్కుకోకుండా జాగ్రత్తపడుతోంది. త్వరలో భాజపా నేతలు కూడా తమ పార్టీ గేట్లు తెరిచి, ప్రజలలోకి వెళ్ళబోతున్నారు కనుక వాళ్ళు కూడా యుద్ధభేరీలు మ్రోగించడం మొదలుపెట్టవచ్చును.
ఒకవేళ వైకాపాతో స్నేహం చేయాలని భాజపా భావించినట్లయితే, ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి ఇంక ఎన్నడూ మాట్లాడకపోవచ్చును. అప్పుడు ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాల గురించి తెదేపా గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టవచ్చును.