అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో మోడీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, భాజపాకి ఎటువంటి నష్టం ఉండకపోవచ్చు. పైగా సుప్రీం కోర్టు ఆదేశాలనే భాజపా చాలా తెలివిగా ఉపయోగించుకొంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి నబం తుకిని ఇరకాటంలే పెట్టేందుకు ప్రయత్నిస్తుండటం మరో విశేషం.
ఆ రాష్ట్రంలో భాజపా మద్దతుతో ఏర్పడిన కలికి పౌల్ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పుతో అధికారం కోల్పోయింది. మళ్ళీ నబం తుకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయనది మూనాళ్ళ ముచ్చటేనని ఆ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జూలై 16న శాసనసభని సమావేశపరిచి తన బలాన్ని నిరూపించుకోవలసిందిగా తాత్కాలిక గవర్నర్ తధాగత రాయ్ ముఖ్యమంత్రి నబం తుకిని ఆదేశించారు. బలపరీక్ష ప్రక్రియని వీడియో షూట్ చేయాలని, ఈ యావత్ కార్యక్రమం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే ఖచ్చితంగా జరగాలని గవర్నర్ ఆదేశించారు.
అయితే 60మంది సభ్యులు కల అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో నంబం తుకికి కేవలం 15మంది మద్దతు ఇచ్చేవారున్నారు. భాజపా సమర్ధిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కలికి పౌల్ కి 42 మంది సభ్యుల మద్దతు ఉంది. కనుక బలపరీక్ష జరిగితే నబం తుకి ఓడిపోవడం మళ్ళీ అధికారం కోల్పోవడం తధ్యం. అందుకే ఇంత తక్కువ సమయంలో బలపరీక్షని నిర్వహించలేమని కనీసం రెండు వారాలు సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి గవర్నర్ ని కోరారు. వరదలు, వానల కారణంగా రాష్ట్రంలో చాలా అత్యవసర పరిస్థితి నెలకొని ఉందని, ముందు ఆ సమస్యలని పరిష్కరించిన తరువాత బలపరీక్ష నిర్వహిస్తామని గవర్నర్ ని కోరారు. అయితే బలపరీక్షని ఎదుర్కోలేకనే దానిని మరికొంత కాలం వాయిదా వేయడానికి వరదలు ఒక సాకు అని అర్ధమవుతూనే ఉంది.
ముఖ్యమంత్రి అభ్యర్ధనపై గవర్నర్ ఇంకా స్పందించలేదు. కానీ రాష్ట్రంలో మళ్ళీ వీలయినంత త్వరగా అధికారం చేజిక్కించుకోవాలని భాజపా భావిస్తోంది కనుక ముఖ్యమంత్రి అభ్యర్ధనని గవర్నర్ ఆమోదించకపోవచ్చు. ఒకవేళ మరికొన్ని రోజులు సమయం ఇచ్చినా భాజపాకి కలిగే నష్టం ఏమీ ఉండదు. మళ్ళీ అధికారం చేపట్టడంలో మరి కొంత ఆలశ్యం జరుగుతుంది అంతే. సుప్రీం కోర్టు తీర్పు కారణంగానే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన నబం తుకి దాని ఆదేశాలని అమలుచేయనని చెప్పలేరు. కనుక ఆ ఆదేశాల ప్రకారమే తక్షణమే బలపరీక్ష నిర్వహించమని గవర్నర్ కోరుతున్నారు. అంటే వీలయినంత త్వరగా ముఖ్యమంత్రి కుర్చీని ఖాళీ చేయమని చెపుతున్నట్లే కదా!