ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ – జనసేన పార్టీ మధ్య పొత్తు… అంత సవ్యంగా ఉన్న పరిస్థితులు కనిపించడం లేదు. పదో తేదీ తర్వాత బీజేపీతో సంబంధం లేకుండా.. అమరావతి గ్రామాల్లో పర్యటించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. బీజేపీ కూడా జనసేన ప్రస్తావన లేకుండా.. అమరావతిలో బహిరంగసభ నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ విజయవాడలో సమావేశమైంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. ఇందులో జనసేన ప్రస్తావన వచ్చినప్పటికీ.. అంత సుదీర్ఘమైన చర్చ జరగలేదు.
కలుపుకుని వెళ్లాలని అనుకున్నారు. బహిరంగసభకు.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించాలని నిర్ణయించారు. కోర్ కమిటీ మీటింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా… జనసేన గురించి ఎక్కువగా స్పందించలేదు. తాము అమరావతి ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పుకున్నారు. అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని… అవసరం అయితే న్యాయపోరాటం కూడా చేస్తామన్నారు. బీజేపీ నేతలు.. కేంద్రం జోక్యంపై మాత్రం మాట్లాడటం లేదు. ప్రత్యేకహోదా అడిగితే.. రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని.. జీవీఎల్.. హెచ్చరిస్తున్నారు.
కానీ.. రాజధాని విషయంలో మాత్రం ఇంత కటువు తనాన్ని ప్రదర్శించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ… పట్టించుకోవడం లేదనే అసంతృప్తి… జనసేన అధినేతలో ఉందని.. అందుకే… దూరంగా జరిగే ప్రయత్నం చేస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. హడావుడిగా పొత్తు ప్రకటన చేసుకుని.. అంతే హడావుడిగా …దూరం..దూరం అంటున్న జనసేన – బీజేపీ… అమరావతి పోరాటాన్నైనా కలిసి చేస్తాయో లేదో మరి..!