తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసి.. తాము ఏపీలో బలపడ్డామని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉబలాట పడుతోంది. ముఖ్యంగా ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న సునీల్ ధియోధర్ తాను.. పార్టీని బలపర్చానని చెప్పుకోవాలని తహతహలాడుతున్నారు. ఆరు నెలలు తిరుపతిలోనే మకాం వేసి.. లోక్సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తానని ఆయన పెద్దలకు హామీ ఇచ్చారు . అంతే కాదు.. పార్టీ సీనియర్ నేతలతో.. రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. పార్టీలోకి వచ్చే వారు ఎవరా అన్న అంశంపై ప్రస్తుతానికి చర్చలు జరుపుతున్నారు. బీజేపీకి అభ్యర్థి లేరు కాబట్టి… పక్క పార్టీల నుంచి తీసుకు రావాల్సి ఉంది.
బలమైన అభ్యర్థి ఎవరా అని ఆలోచించి.. చివరికి.. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మాజీ కాంగ్రెస్ నేత పనబాక లక్ష్మి వైపు మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు. అయితే పనబాక లక్ష్మి నేరుగా వైసీపీ టిక్కెట్ కోసమే ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ టిక్కెట్ ఇస్తే.. ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమని సంకేతాలు పంపుతున్నారు. కానీ స్పందన రావడం లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీడీపీ వైపు చూడకపోవడతో.. తెలుగుదేశం పార్టీ.. అసలు పనబాక లక్ష్మి అభ్యర్థిత్వంపై ఆలోచన కూడా చేయడం లేదు. కానీ బీజేపీ మాత్రం ఆమెను చేర్చుకోవాలని అుకుంటోంది. జనసేన మద్దతు ఉంటుందని… తిరుపతి పార్లమెంట్ పరిధిలో పవన్ ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారని బీజేపీ భావిస్తోంది.
అయితే జనసేన కూడా టిక్కెట్ డిమాండ్ చేస్తే పరిస్థితి ఏమిటన్నదానిపై చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన .. తిరుపతి సీటును బీఎస్పీకి ఇచ్చింది. బీఎస్పీ అభ్యర్థి ఇరవై వేల ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. గతంలో టీడీపీ మద్దతుతో బీజేపీ ఓ సారి తిరుపతి నుంచి గెలిచింది. బీజేపీ పోటీ చేయాలనుకుంటే.. జనసేన అడిగినా ప్రయోజనం ఉండదు. అడగకుండా చేయగలరు కూడా. మొత్తానికి బీజేపీ తిరుపతి ఉపఎన్నికపై పొలిటికల్ ఇన్వెస్ట్ మెంట్ చేయాలని గట్టిగానే నిర్ణయించుకుంది.