రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు తెలంగాణలోనే జరుగుతూ ఉంటాయి. ఆదివారం మరో విచిత్రం జరగనుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన సభకు బీజేపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరవుతున్నారు. ఇందు కోసం పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఈ అభినందన సభను క్షత్రియ సేవా సమితి నిర్వహిస్తోంది. అందుకే క్షత్రియ వర్గానికి చెందిన శ్రీనివాస వర్మ హాజరవుతున్నారు.
మామూలుగా ఇదేదో సామాజికవర్గ సమావేశం.. రాజకీయాలకు అతీతమన సమావేశం అనుకుంటే… బీజేపీ కేంద్ర మంత్రి హాజరైనా ఎలాగోలా కవర్ చేసుకోవచ్చు. కానీ.. క్షత్రియ సేవా సమితీ రేవంత్ రెడ్డికి ఈ అభినందన ఏర్పాటు చేసింది రుణమాఫీ చేశారని.. రైతులకు ఆండగా ఉన్నారన్న కారణంతో. అంటే అది ఫక్తు రాజకీయ కారణం. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని తెలంగాణ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ పార్టీ కేంద్ర మంత్రి రుణమాఫీ అభినందన సభలో పాల్గొనడం ఆ పార్టీకి ఇబ్బందికరమే.
భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఈ విషయం తెలిసే రేవంత్ రెడ్డిని అభినందించే కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొనేందుకు అంగీకరించారో లేదో తెలియదు కానీ.. ఆయన మాత్రం… ఇరుక్కుపోతారు. విమర్శలు ఎదుర్కొంటారు. పొత్తు పుణ్యమా అని.. సింపుల్ ఎంపీ అయిపోయి.. ఆ తర్వాత …. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన ఆయన రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు.