తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి విద్యార్హతపై కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్లలో తన విద్యార్హతకు సంబంధించి రెండు సందర్భాల్లో రెండు రకాలుగా సమాచారం ఇచ్చారంటూ ఆ పత్రాలను కూడా రేవంత్ చూపించారు. లక్ష్మారెడ్డి చదవిన నాటికి సదరు కాలేజీకి అనుమతుల్లేవనీ, అలాంటి విద్యా సంస్థ ద్వారా పొందిన డిగ్రీ ఎలా చెల్లుతుందనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. 2004, 2014 ఎన్నికల్లో దాఖలు చేసిన పత్రాల్లో, తన ఉత్తీర్ణతా సంవత్సరాన్ని రెండు రకాలుగా ప్రకటించారనీ, ఓసారి గుల్బర్గా విశ్వవిద్యాయలంలో చదువుకున్నాననీ, మరోసారి మరో యూనివర్శిటీ నుంచి పట్టా పొందానని ఆయన స్వయంగా ప్రకటించుకున్నారని రేవంత్ అన్నారు. తన విద్యార్హతపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలన్నది రేవంత్ డిమాండ్.
రేవంత్ ఆరోపణలపై మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. తన విద్యార్హతకు సంబంధించి ఇదివరకే చాలా స్పష్టత ఇచ్చాననీ, అయినాసరే రేవంత్ పదేపదే దీనిపై విమర్శలు చేస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తాను చదివిన కాలేజీతోపాటు, ధ్రువపత్రాలకు సంబంధించిన అంశాలపై చాలా స్పష్టంగా మాట్లాడననీ చెప్పారు. ఆరోపణలు చేసేవారే మీడియా ప్రతినిధులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలనీ, వారిని తాను గుల్బర్గా యూనివర్శిటీకి తీసుకుని వెళ్తానన్నారు. అక్కడికి వెళ్లాక నిజానిజాలు ఏంటో వారికే అర్థమౌతాయన్నారు. ఒకవేళ తాను అబద్ధమాడినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి సవాల్ చేశారు. ఎన్నికల సందర్భంలో తాను దాఖలు చేసిన పత్రాల్లో రాసినవి కూడా నిజాలే అని వివరించారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేద్దాం అంటూ మీడియాకు చెప్పడం గమనార్హం!
రేవంత్ ఆరోపణలపై మంత్రి స్పందన బాగానే ఉందిగానీ.. అసలు విషయాలపై దాటవేత ధోరణి కనిపిస్తోంది. రేవంత్ ఆరోపణల తరువాత తలెత్తిన అనుమానాలపై ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు! ఆయన పొందిన బీహెచ్ ఎంసీ డిగ్రీ గుల్బర్గా యూనిర్శిటీ నుంచే పొందారా, లేదంటే మరో విశ్వవిద్యాలయం నుంచి పొందారా..? ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నట్టు 1987లో పాస్ అయ్యారా..? లేదా, 1988లో పాస్ అయ్యారా..? ఆయన చదువుకున్న కాలేజ్ కి 1985 లోపు సీసీహెచ్ అనుమతి ఉందా లేదా..? లక్ష్మారెడ్డి విద్యార్హతకు సంబంధించిన అసలు అనుమానాలు ఇవి కదా! వీటిపై ఆయన సూటిగా స్పందించకుండా… మీడియా బృందం తీసుకెళ్తాననీ, రాజకీయ సన్యాసమనీ మంత్రి మాట్లాడటం కాస్త విడ్డూరంగానే ఉంది.