బిజెపి అద్యక్షుడు అమిత్ షా కుమారుడు జరుషా అధీనంలోని చిన్న వ్యాపార సంస్థ ఆదాయం ఏడాదిలో 16 వేల రెట్లు పెరిగిన ఉదంతంలో ఉడుక్కోవడం తప్ప ఆ పార్టీ నాయకత్వం ఏమీ చేయలేకపోతున్నది. ఈ కథనం ప్రచురించిన వైర్ వెబ్‌సైట్‌పై పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమై పోతున్నది. వాస్తవానికి వైర్ కథనం ప్రచురించేముందు తమదగ్గరున్న సమాచారంపై ప్రశ్నలు వేసేందుకు జయషాతోనే మాట్లాడింది. ఆయన అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అయితే ప్రయాణంలో వున్నాననీ, తర్వాత చెబుతానని దాటవేసిన జయషా తర్వాత మీపై పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని తమ లాయర్‌తో చెప్పించారు. అయినా వైర్ నిర్భయంగా కథనం ప్రచురించింది. ఈ వివరాలన్నీ కంపెనీల రిజిస్ట్రార్ ఇచ్చినవే తప్ప కల్పితాలు కావు. 50 వేల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చే టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ ఒక్క ఏడాదిలో 80 కోట్ల లాభానికి ఎలా చేరింది? మళ్లీ అంతలోనే దాన్ని మూసివేస్తున్నట్టు ఎందుకు ప్రకటించింది? అసలే నడవని ఈ కంపెనీకి రిలయన్స్అనుబంధ సంస్థ 15 కోట్లు పూచీలేని రుణం ఎలా ఇచ్చింది? వైర్ లేవనెత్తిన ఈ ప్రశ్నలకు సహేతుక సమాధానాలు ఇవ్వలేకనే కేంద్ర ప్రభుత్వం బిజెపి నాయకత్వం అడ్డం తిరుగుతున్నాయి. ఈ విషయంలో పోటీ పడి మరీ కేంద్ర మంత్రులు జయషాను వెనకేసుకొస్తున్నారు. ఆఖరుకు హౌం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా జయషా నిర్దోషి అంటున్నారు. ప్రతిపక్షాల మీద ఏ చిన్న అవకాశం దొరికినా దాడి చేసే సిబిఐని దర్యాప్తు సంస్థలను పురికొల్పే కేంద్రం ఈ విషయంలో మౌనంగా వుంది. టెంపుల్ సంస్థ వైర్‌పై 100 కోట్ల రూపాయాల పరువునష్టం దావా వేసిందే గాని నిజానిజాలు నమ్మకంగా చెప్పలేకపోతున్నది. పూర్తి వివరాలు తెలియకుండానే కథనం వచ్చీ రాగానే పియుష్ గోయోల్ వంటివారు అక్రమాలు జరగనేలేదని ఎలా ప్రకటిస్తున్నారు? అధికారంలో వున్న వారిమీద అగ్రనేతల మీద ఆరోపణలు వస్తే బాధ్యతగా స్పందించాలే గాని ఎదురుదాడి చేసి మాఫీ చేయాలనుకోవడం తగనిపని. దర్యాప్తు మాట అటుంచి ఆరోపణలకు గురైన జయషా తరపున వాదించేందుకు కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాదికి అవకాశమివ్వడం, సాంకేతికంగా సమర్తించుకోవడం దేనికి నిదర్శనం? అమిత్ అద్యక్షుడు కావచ్చు గాని ఆయన కుమారుడినికి కూడా ఇంతగా నెత్తినపెట్టుకుంటున్నారంటే బిజెపిలోనూ వారసత్వం నడుస్తుందా? వందిమాగధ సంసృతి ముదిరిపోతున్నదా? ఆయనపై ఆరోపణలతో సంబంధం లేని శాఖల వారు కూడా ఎందుకు పోటీపడి జేజేలు పలుకుతున్నారు? ఇవన్నీ చేసే బదులు నిజానిజాలు చెప్పేస్తే సరిపోతుం. కాంగ్రెస్‌పైన లేక ఇతరుల పైన ఆరోపణలు వస్తే వంటికాలితో లేచేవారు తమ విషయంలోనూ అదే నిక్కచ్చితనం చూపించాలి మరి.