ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తెదేపా ఎంపిలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు కనుక రాష్ట్ర భాజపా నేతలు కూడా వారికి ధీటుగా ప్రతివిమర్శలు చేయడం మొదలుపెట్టారు. వారి మద్య మొదలైన ఈ యుద్ధం కొన్ని రోజుల తరువాత ఇదివరకులాగే అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. కానీ ప్రస్తుతం ఆ యుద్ధంలో రెండు పక్షాల నేతలు కాలక్షేపానికో లేదా దీనిని తమ అక్కసు తీర్చుకోవడానికి మంచి అవకాశంగా భావించడం వలననో ఒకరిపై మరొకరు బాణాలు వేసుకొంటున్నారు.
భాజపాలో తెదేపా వ్యతిరేకించే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఈసారి యుద్ధం ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం సహకరించడం లేదనే తెదేపా ఎంపిల, ముఖ్యమంత్రి వాదనని తాము ఖండిస్తున్నామని చెప్పారు. తెదేపా నేతలు ఈ విషయంలో ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని అన్నారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి ప్రజలని మోసం చేస్తున్నందుకు భాజపాకి ప్రజలు బుద్ధి చెపుతారని తెదేపా ఎంపిలు చెప్పడాన్ని ఆకుల సత్యనారాయణ గట్టిగా ఖండించారు. తెదేపాకి ధైర్యం ఉంటే ఆ పార్టీలో చేర్చుకొన్న వైకాపా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు నిర్వహిస్తే, భాజపా ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నారని తెదేపాకి సవాలు విసిరారు. అప్పుడు ప్రజలు ఎవరివైపు ఉన్నారో తేలిపోతుందని చెప్పారు.
కేంద్రప్రభుత్వంపై మిత్రపక్షంగా ఉన్న తెదేపా నేతలు విమర్శలు చేయడం భాజపా నేతలకి ఆగ్రహం కలిగించడం సహజమే కనుక ప్రతివిమర్శలు చేయడమ కూడా సహజమే. కానీ ఉపఎన్నికల సవాలు విసరడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా పరిస్థితి ఏమిటో ఆ పార్టీ నేతలకి బాగా తెలుసు. ప్రత్యేక హోదా కారణంగా ఏపిలో, హైకోర్టు విభజన చేయనందున తెలంగాణా రాష్ట్రంలో ప్రజలు కేంద్రం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారనే సంగతి రాష్ట్ర భాజపా నేతలకి బాగా తెలుసు. ఇటువంటి పరిస్థితులలో ఆకుల సత్యనారాయణ ఉపన్నికలకి సవాలు విసరడం ద్వారా తెదేపాని ఇబ్బందిపెట్టగలరేమో కానీ నిజంగా ఇప్పటికిప్పుడు ఉపఎన్నికలు ఎదుర్కోవలసివస్తే ఒక్క భాజపా నేత కూడా గెలిచే అవకాశం ఉండక పోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా నేతలు ఎప్పుడూ వాపుని చూసి బలుపు అనుకొంటుంటారు. తమ వద్ద ఎన్నికలలో పోటీ చేసి గెలవగలిగే బలమైన అభ్యర్ధులు లేనప్పట్టికీ, మిత్రపక్షం తెదేపా నుంచి పట్టుబట్టి మరీ సీట్లు తీసుకొని చతికిలపడుతుంటారు. అయినప్పటికీ భాజపా నేతలు ఈవిధంగా ప్రగల్భాలు పలకడం మానుకోకపోవడం విచిత్రంగానే ఉంటుంది. ఒకవేళ ప్రస్తుత పరిస్థితులలో ఉపఎన్నికల నిర్వహిస్తే బహుశః తెదేపా, భాజపాలు రెండూ కూడా నష్టపోవచ్చు రొట్టె ముక్క కోసం కాకులు దెబ్బలాడుకొంటే దానిని పిల్లి ఎత్తుకుపోయినట్లు అన్ని సీట్లని వైకాపా గెలుచుకొన్నా ఆశ్చర్యం లేదు.