రాజమండ్రి అర్బన్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ… జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 21న పవన్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నట్లు ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. ప్రస్తుతం ఆకుల సత్యనారాయణ భార్య జనసేన నేతగా ఉన్నారు. ఆమెకు రాజానగరం అసెంబ్లీ టిక్కెట్, ఆకుల సత్యనారాయణకు రాజమండ్రి పార్లమెంట్ టిక్కెట్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీంతో.. ఆకుల సత్యనారాయణ పవన్ తో నడవాలని నిర్ణయించుకున్నారు. బీజేపీకి ప్రజాదరణ లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరు బాధకలిగించిందని ఆకుల సత్యనారాయణ చెబుతున్నారు. విశాఖ రైల్వేజోన్, కడప స్లీల్ప్లాంట్ ప్లాంట్…దుగరాజపట్నం పోర్టు విషయంలో కేంద్రం తీరు బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. పవన్ పిలుపు ఇస్తే ప్రజలు తరలివస్తున్నారని అందుకే.. జనసేనలో చేరుతున్నానని చెప్పుకొచ్చారు.
మూడు రోజుల కిందట.. ఆకుల సత్యనారాయణ రాజీనామా చేయడానికి ఢిల్లీ వెళ్లారు. అక్కడ అమిత్ షాను కలిసి రాజీనామా లేఖ ఇద్దామని ప్రయత్నం చేసినా కుదరలేదు. దాంతో తిరిగి వచ్చేశారు. అప్పటికే మీడియాలో రావడంతో… రాజీనామా అంశాన్ని తోసి పుచ్చారు కానీ.. ఖండించలేదు. ఇప్పుడు ఖరారు చేశారు. భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. టీడీపీ పదమూడు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే.. అందులో నాలుగు చోట్ల మాత్రం విజయం సాధించారు. రాజమండ్రి అర్బన్, తాడేపల్లిగూడెం,కైకలూరు, విశాఖ ఉత్తర స్థానాల నుంచి ఎమ్మెల్యేలుగా బీజేపీ నేతలు గెలిచారు. వీరిలో ఇప్పుడు.. ముగ్గురు పక్క చూపులు చూస్తున్నారు. తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే మాణిక్యాల రావు మాత్రమే బీజేపీలో గట్టిగా ఉంటారని చెబుతున్నారు. ఆకల సత్యనారాయణ గుడ్ బై చెప్పేశారు. ఇక కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు. అలాగే విష్ణుకుమార్ రాజు కూడా టీడీపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు.
భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకడం కష్టంగా మారింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలుగా చెలామణి అవుతున్న వారెవరూ.. పోటీకి సిద్ధపడటం లేదు. అదే సమయంలో.. పార్టీలో గ్రూపు తగాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక నేతంటే.. మరో నేతకు సరి పడని పరిస్థితి ఉంది. నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, విశాఖ ఎంపీ హరిబాబు కూడా.. ఇటీవలి కాలంలో.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. తాము ఈ సారి పోటీ చేయబోవడం లేదని.. వారు తమ సన్నిహితులకు చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీ బీజేపీకి.. మరిన్ని ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.