ఏ ముహుర్తాన రకరకాల ఆపరేషన్ ఆకర్ష్‌లు ప్రయోగించి కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేసి.. తాము పీఠంపై కూర్చున్నారో కానీ బీజేపీకి ఏదీ కలసి రావడం లేదు. ముఖ్యమంత్రిని మారిస్తే సీన్ మారుతందనుకుంటే మరింత వరస్ట్‌గా మారింది. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిని మారుస్తారన్న చర్చలు ప్రారంభయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే రూ. రెండున్నర వేల కోట్లు ఇస్తే తనకు సీఎం పదవి ఇస్తామన్నారని ప్రకటించి.. కొత్త తలనొప్పి తెచ్ిచ పెట్టారు.
సీఎం పదవి ఇవ్వాలంటే రూ. రెండున్నర వేల కోట్లు అడుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ నేరుగా వ్యాఖ్యానించారు. ఆయన మాజీ కేంద్రమంత్రి కూడా. కర్ణాటకలో సీఎంను మారుస్తున్ారన్న ఊహాగానాల కారణం తాను కూడా రేసులో ఉన్నానని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఇలా రూ. రెండున్నర వేల కోట్లు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు చేయడంతో బీజేపీ వర్గాల్లోనూ సంచలనం ప్రారంభమయింది. అయితే బసనగౌడ పాటిల్ తన పార్టీ నేతలు అడుగుతున్నారని చెప్పడం లేదు . ” ఢిల్లీ నుంచి కొంతమంది నా దగ్గరకు వచ్చి నన్ను సీఎంను చేస్తానని, అందుకు రూ. 2500కోట్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారంటున్నారు” .
కర్ణాటక బీజేపీ నేతలెవరూ బసనగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించలేదు. కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం మండి పడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఈ పరిణామాలను తీవ్రంగా తీసుకోవాలని, దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా దీనిపై విచారణ సంస్థలు దర్యాప్తు చేయవా అని ట్వీట్ చేశారు. మొత్తంగా కర్ణాటకలో బీజేపీ పరువు రోడ్డున పడుతోంది.