అదొక మూగజీవి. పైగా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సేవ చేస్తోంది. దానిపై భాజపా ఎమ్మెల్యే గణేష్ జోషి తన ప్రతాపం చూపడంతో దాని కుడి కాలు తీసివేయవలసి వచ్చింది. ఆ మూగజీవి పేరు శక్తిమాన్. అది ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన గుర్రం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ నిధులు దుర్వినియోగం చేసారని ఆరోపిస్తూ స్థానిక భాజపా నేతలు, కార్యకర్తలు సోమవారంనాడు డెహ్రాడూన్ లో ఒక నిరసన ర్యాలీ నిర్వహించారు. వారిని అడ్డుకొనేందుకు పోలీసులు గుర్రాలపై వచ్చినపుడు వారిలో భాజపా ఎమ్మెల్యే గణేష్ జోషి తన చేతిలో ఉన్న పెద్ద కర్రతో శక్తిమాన్ అనే గుర్రంపై దాడి చేసాడు. అతను కొట్టిన దెబ్బలకి ఆ గుర్రం తీవ్రంగా గాయపడింది. దాని ముందరి కాళ్ళలో కుడికాలు ఎముకలు మోకాలు వరకు నుజ్జునుజ్జయిపోయాయి. దానికి వైద్యం చేయడానికి ఏకంగా పది మంది వైద్యులు అవసరం పడ్డారంటే అది ఎంత తీవ్రంగా గాయపడిందో అర్ధం చేసుకోవచ్చును. తప్పనిసరి పరిస్థితిలో దాని మోకాలు వరకు కాలిని తీసివేయవలసి వచ్చింది. ఆపరేషన్ చేసి దాని కాలు తొలగించిన తరువాత మళ్ళీ దాని స్థానంలో ఒక కృత్రిమ కాలుని వైద్యులు అమర్చారు. నోరులేని ఆ మూగజీవిని అంత దారుణంగా గాయపరిచిన గణేష్ జోషిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేనకా గాంధీ ప్రధాని నరేంద్ర మోడిని కోరారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసారు. అయితే ఆ సమయంలో తన చేతిలో కర్ర ఉన్న మాట వాస్తవమే కానీ తను గుర్రం మీద దాడి చేయలేదని, ఒకవేళ దాడి చేసినట్లు రుజువుచేస్తే ఏ శిక్షకయినా తాను సిద్దం అని గణేష్ జోషి వాదిస్తున్నారు. మరి అతను చేయకపోతే ఆ గుర్రానికి కాలు ఎలాగ విరిగింది? ర్యాలీలో పాల్గొంటున్న అతని చేతిలో కర్ర ఎందుకుంది? ఒకవేళ తను దాడి చేయకపోతే మరి దానిపై ఎవరు దాడి చేసారో ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.