తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేయబోతున్నారని తెలిసిన తర్వాత బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి చాలా ఆనందంగా స్పందించారు. తమ నెత్తిన కేసీఆర్ పాలు పోస్తున్నారని.. సంతోషం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి అంత సంతోషం ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. అందరి ఎమ్మెల్యే పదవులూ ఒక్కసారే పోతున్నాయని ఆనందం కావచ్చు. టీ బీజేపీ అధ్యక్ష పదవి లక్ష్మణ్ కు అప్పగించిన తర్వాత కిషన్ రెడ్డికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇప్పుడంతా లక్ష్మణే కనిపిస్తున్నారు. అంతకు ముందు నుంచి లక్ష్మణ్‌కు, కిషన్ రెడ్డికి పెద్దగా పడదు. ఇటీవలి కాలంలో లక్ష్మణ్ చేస్తున్న హడావుడి చూసి.. మరింతగా రగిలిపోతూ ఉంటారు. అందుకే కావొచ్చు.. రాక రాక లక్ష్మణ్ కు వచ్చిన ఎమ్మెల్యే పదవి తొమ్మిది నెలల ముందే పోతుందని సంతోష పడుతూ ఉండవచ్చు.
అసోం స్టైల్లో దున్నేస్తామని.. కిషన్ రెడ్డి చెబుతున్నారు కానీ.. అసలు అసోంలో ఏం జరిగిందో.. ఇక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. చెప్పుకోవడానికి బాగుంది కదా అని మాటల్ని ఒడుపుగా వాడేస్తున్నారు కానీ.. బీజేపీకి ఈ సారి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభిస్తుందా.. అనే దానిపై.. ఎవరికీ డౌట్స్ లేవు. చాన్సే లేదంటున్నారు. గత మూడు సార్లుగా అసెంబ్లీ స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చిన కిషన్ రెడ్డి కూడా ఈ సారి బయటపడటం సాధ్యం కాదనే అంచనాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఇక టీడీపీతో పొత్తు పుణ్యమా అని.. నాలుగు చోట్ల గెలిచిన ఎమ్మెల్యేల్లో ఈ సారి ఎవరు ఎక్కడైనా డిపాజిట్లు తెచ్చుకుంటారో లేదో కూడా.. సందహమే. ఆ ఎమ్మెల్యేల్లో ప్రజల్లో పలుకుబడి ఉన్న వాళ్లు లేకపోగా.. పనితీరుతో.. మెప్పించిన వారు లేరు.
కేంద్ర రాజకీయాల కోసం బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటి వరకూ.. టీఆర్ఎస్ను మోసింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తెలంగాణ సీఎంను.. గొప్ప పాలకుడని కీర్తించారు. ఇక తెలంగాణకు వచ్చి వారు ఏమీ చెప్పుకుంటారు..? అమిత్ షా తెలంగాణలో మకాం వేసి మరీ పార్టీని నడిపిస్తానని చెప్పుకున్నా… ఒరిగేదేమీ ఉండదు. కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం తప్ప. ఈ విషయం తెలియక కాదు.. తెలిసే.. కిషన్ రెడ్డి.. ఏడవలేక నవ్వుతున్నారు..! ముందస్తుకు వెళ్లితే.. తమకు మంచిదేనంటున్నారు.