బీజేపీకి ఓట్లు వేయని వాళ్ల గురించి మాకు తెలిసిపోతుంది. ఎన్నికలవగానే వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తాం అని హైదరాబాద్‌లో రాజాసింగ్ అనే బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. ఆయన ఆషామాషీగా అనలేదు. యూపీలో ఉన్న భయస్తులైన ఓటర్లు… ఉన్న గూడు చెదిరిపోతుందేమో అని భయపడే పేదలను టార్గెట్ చేసుకుని అన్నారు. అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అదే తరహాలో మాట్లాడారు. వారి వ్యూహం వర్కవుట్ అయింది. ఆ తర్వాత బుల్డోజర్లతో యూపీలో జరుగుతున్న విధ్వంసం గురించి చెప్పాల్సిన పని లేదు. నేరస్తుల ఇళ్లను కూల్చేస్తున్నామని గొప్పగా ప్రకటిస్తున్నారు.. కానీ ఏ చట్టం ప్రకారం..అనేది ఎవరూ చెప్పరు. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఢిల్లీలో అమలు ప్రారంభించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్ పీర్ ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. వెంటనే బీజేపీ నేత ఒకరు అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని లేఖ రాశారు. వెంటనే బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. ముందూ వెనుకా చూసుకోకుండా కూల్చివేతలు ప్రారంభించారు. అనుమతులు ఉన్న వారివీ వదల్లేదు.. లేనివారివీ వదల్లేదు. వృద్ధులు ఉంటున్న ఇంటినీ వదల్లేదు. కూల్చేసుకుంటూ వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆపడంతో… కూల్చాలనుకున్నవాటిని కూల్చి ఆపేశారు.
అల్లర్ల నిందితులు ఉంటున్న అక్రమ కట్టడాలని అధికారులు చెబుతున్నారు కానీ అదంతా బుల్డోజర్ రాజకీయం అని స్పష్టంగా తెలిసిపోతోందని చెబుతున్నారు. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా.. ఎన్నికలు వాయిదా వేశారు. ఒకే కార్పొరేషన్‌గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీజేపీకి ఓటువేయకపోతే బుల్డోజర్లు వస్తాయన్న సంకేతాలను జహంగీర్ పీర్ కూల్చివేతల ద్వారా ప్రజల్లోకి పంపారు. ఇక చచ్చినట్లు తమకు ఓటు వేస్తారని బీజేపీ వ్యూహం. ఆస్తులు ధ్వంసం చేస్తారేమోనని ప్రజల్ని భయ పెట్టడానికి బుల్డోజర్లను బ్రాండ్‌గా వాడుకుంటున్నారు బీజేపీ నేతలు.
విచిత్రంగా నిరుపేద, మధ్యతరగతి ప్రజల ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడాన్ని అనేక మంది సమర్థిస్తున్నారు. ఆ కుటుంబాల వారు తప్పు చేశారో లేదో ఎవరూ నిర్ధారిచలేదు. కానీ నిర్ధారించేసి కరెక్ట్ చేస్తున్నారని వాదిస్తున్నారు. తమదాకా వస్తే తెలియదన్నట్లుగా వారికీ ఆ బాధేంటో తెలిసే వరకూ కూల్చివేత బాధితుల కష్టం అర్థం కాదు. మొత్తంగా ఇప్పుడు బీజేపీ అంటే కమలం కాదు బుల్డోజర్ అన్నంత పబ్లిసిటీ వస్తోంది.