తెలంగాణ భాజపాలో ఇప్పుడు ఒక్కసారిగా దుమారం రేపుతున్నాయి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు! నిజానికి, ఆయన కొంతకాలంగా భాజపా నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. రాష్ట్రంలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదనీ, కొంతమంది నాయకులు ఉద్దేశపూర్వకంగానే తనని పక్కకి పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది ఆయన అసంతృప్తిగా తెలుస్తోంది. ఇప్పుడు అదే బయట పెట్టారంటున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… భాజపాలో తాను ఎదుగుతుంటే కొంతమంది చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఉన్న అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతూ… ఆయన ప్రోటోకాల్ కూడా పాటించడం లేదన్నారు. తన సొంత నియోజక వర్గానికి వచ్చినప్పుడు తనకు సమాచారం ఇవ్వరన్నారు రాజాసింగ్. ఈ విషయంలో గతంలో కేంద్రమంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ చాలా నయమన్నారు. ఆయన చాలా పద్ధతిగా ఉండేవారన్నారు. ఎన్నికల సమయంలో తనకు సీటు రాకుండా చేసేందుకు కొంతమంది అడ్డుపడ్డారనీ, ఆ తరువాత తనని ఓడించేందుకు కూడా ప్రయత్నించారనీ, కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెట్టి తనని గెలిపించుకున్నారన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉండటం వల్లనే లక్ష్మణ్ గత ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. భాజపా అధ్యక్ష పదవి రేసులో లేననీ, తనకు పదవుల మీద ఆశ లేదన్నారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు డీకే అరుణ, బండి సంజయ్, డి. అరవింద్ అర్హులే అన్నారు. అరవింద్ ఆర్థికంగా బలమైన నాయకుడు అని రాజాసింగ్ చెప్పారు.
బీజేపీ ఎల్పీగా ఉన్నా కూడా తనని రాష్ట్ర నాయకులు పట్టించుకోవడం లేదన్నది రాజాసింగ్ అసంతృప్తి! ఈ పరిస్థితికి కారణం కిషన్ రెడ్డి అని ఓపెన్ గానే చెబుతున్నారు. మొత్తానికి, రాజాసింగ్ వ్యవహారం ఇప్పుడు టి.భాజపాలో కొత్త పంచాయితీకి తెర లేచేలా ఉంది. ఓపక్క రాష్ట్ర భాజపా అధ్యక్ష పదవి ఎంపిక కసరత్తు జరుగుతుంటే… తాను రేసులో లేనంటూనే, తన గురువు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అనీ, ఆయన బాటలోనే హిందూ ధర్మం కాపాడతా, గోశాలల్లో సేవ చేసుకుంటా అంటున్నారు. పార్టీ బలోపేతం కావాలనీ, అందరూ ఐకమత్యంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయాలంటూ జాతీయ నాయకత్వం చెబుతుంటే… రాజా సింగ్ ఇలా వ్యాఖ్యానించడం కొంత మైనస్సే అవుతుంది. ఇంతకీ… రాజాసింగ్ వ్యాఖ్యలు కేవలం అసంతృప్తిని వ్యక్తం చేయడం వరకే పరిమితమా, మరేదో నిర్ణయానికి ఇది ప్రారంభమా అనే అనుమానాలూ కలుగుతున్నాయి!