భక్తుడు కోరుకొన్నదీ అదే…దేవుడు ఇచ్చిన వరం కూడా అదే అన్నట్లుంది ఘోషామహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్, బీజేపీల మధ్య సాగుతున్న వ్యవహారం. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయిన నాటి నుండి ఇంతవరకు పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టలేదని, ఆయన తెరాసలోకి మారాలనుకొంటున్నట్లు తమకి తెలిసిందని బీజేపీ నేత వెంకట రెడ్డి అన్నారు. బహుశః అందుకే ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తిరుగుబాటు చేయడమే కాకుండా, పార్టీకి తీవ్ర నష్టం కలిగించే వివాదస్పదమయిన వ్యాఖ్యలు చేసారు. కిషన్ రెడ్డిపై పిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడికి ఒక లేఖ కూడా వ్రాసారు. కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవిలో నుంచి తప్పించి ఆయన స్థానంలో ఎమ్మెల్యేలు డా. లక్ష్మణ్, ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ లేదా ఎమ్మెల్సీ రామచంద్రరావులలో ఎవరో ఒకరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్ధులు బీఫ్ ఫెస్టివల్ చేసుకొబోతున్నారనే వార్తలపై రాజా సింగ్ చాలా తీవ్రంగా స్పందించారు. “ఇంతకు ముందు కూడా ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ చేసుకొన్నపుడు నేను వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించాను కానీ అప్పుడు నా బలం సరిపోలేదు. పైగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఫ్ ఫెస్టివల్ చేసుకొంటే తప్పు కాదు అన్నట్లు మాట్లాడటంతో పార్టీ కూడా నాకు అండగా నిలబడలేదు అప్పుడు. కానీ ఈసారి బీఫ్ ఫెస్టివల్ చేసుకొన్నట్లయితే నా తడాఖా చూపిస్తాను. దాద్రీ సంఘటనలు హైదరాబాద్ లో కూడా చూడవలసి వస్తుంది,” అని హెచ్చరించారు.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు ముందు రాజా సింగ్ మాట్లాడుతున్న ఇటువంటి మాటలు పార్టీకి తీరని నష్టం కలిగిస్తాయని చెప్పనవసరం లేదు. కనుక రాజా సింగ్ ని పార్టీ నుండి సస్పెండ్ చేసేందుకు బీజేపీ సిద్దం అవుతోంది. బహుశః ఆయన కూడా అదే కోరుకొంటున్నారేమో? పార్టీ నుండి సస్పెండ్ అయ్యేక ఒకవేళ ఆయన తెరాసలో చేరినట్లయితే, బీఫ్ ఫెస్టివల్ గురించి ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యల వలన ఆపార్టీకి కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది కదా?