చాలా కాలంగా భాజపాకి దూరంగా ఉంటున్న ఘోషా మహల్ (హైదరాబాద్) ఎమ్మెల్యే రాజాసింగ్, తను ఇంకా భాజపాలోనే కొనసాగుతున్నట్లుగా మాట్లాడటం విశేషం. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలో 5మంది ఐసిస్ ఉగ్రవాదులని ఎన్.ఐ.ఏ. అరెస్ట్ చేసిన తరువాత, తెరాస, రాష్ట్ర భాజపా నేతలు ఎవరూ కూడా దానిపై గట్టిగా స్పందించలేదు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ దానిపై చాలా సున్నితంగా స్పందించారు. అయితే, రాజాసింగ్ భాజపాకి దూరంగా ఉంటున్నప్పటికీ భాజపా నేతలలో ఎవరూ ధైర్యం చేయనివిధంగా మజ్లీస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
“హైదరాబాద్ ని తీవ్రవాదుల అడ్డాగా మార్చిన ఘనత మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీదే!వారికి సహాయసహకారాలు అందిస్తున్న అసదుద్దీన్ ఓవైసీపై దేశద్రోహం నేరం మోపి తక్షణమే అరెస్ట్ చేయాలి. నగరంలో చాపక్రింద నీరులా ఉగ్రవాదం పరుచుకోవడానికి వీలు కల్పిస్తున్న మజ్లీస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మజ్లీస్ పార్టీతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారి తెలంగాణా ఏవిధంగా సాధించాలనుకొంటున్నారో? ఆయనకే తెలియాలి. మజ్లీస్ పార్టీతో తెరాసకి పొత్తులున్నాయి కనుకనే ప్రభుత్వం దానిని ఉపేక్షిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రపంచదేశాలన్నీ తిరుగుతూ వాటి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తుంటే, ఇక్కడ తెలంగాణా రాజధాని నడిబొడ్డునే ఉగ్రవాదం పురుడుపోసుకొంటోంది. దానిని అరికట్టవలసిన ప్రభుత్వం, దానిని ప్రోత్సహిస్తున్న మజ్లీస్ పార్టీతో స్నేహం చేస్తూ దాని కోసం ప్రజల భద్రతని పణంగా పెడుతోంది. మజ్లీస్ పార్టీ తెరచాటు వ్యవహారాల గురించి నేను హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి వివరిస్తాను,” అని అన్నారు.
పాతబస్తీలో ఐసిస్ ఉగ్రవాదులు, బారీగా ప్రేలుడు సామాగ్రి, ఆయుధాలు అన్నీ పట్టుబడిన తరువాత మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ, “తమ పార్టీ ఐసిస్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, దానిని పూర్తిగా నాశనం చేయవలసిన అవసరం ఉందని” అన్నారు.
రాజా సింగ్ మజ్లీస్ కి వ్యతిరేకంగా ఆవిధంగా గట్టిగా మాట్లాడటానికి ఒక బలమైన కారణం కనిపిస్తోంది. రాష్ట్ర భాజపా నేతల కంటే తనే ధైర్యంగా మాట్లాడగలనని నిరూపించుకొని మళ్ళీ భాజపాకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోడీని పొగడుతూ, హోం మంత్రిని కలుస్తానని చెపుతున్నారనుకోవచ్చు. ఆయనని భాజపా బయటకి పొమ్మనలేదు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఆయనే కిషన్ రెడ్డితో విభేదించి పార్టీకి దూరం అయ్యారు. కిషన్ రెడ్డి స్థానంలో డా.లక్ష్మణ్ వచ్చారు కనుక రాజా సింగ్ కూడా మళ్ళీ పార్టీకి చేరువవ్వాలని భావిస్తున్నారేమో? అయితే అందుకు ఈ డొంక తిరుగుడు అంతా అనవసరం. నేరుగా డా. లక్ష్మణ్ కలిసి తను మళ్ళీ పార్టీలో కొనసాగాలనుకొంటున్నట్లు చెపితే సరిపోతుంది. ఆయన తప్పకుండా పార్టీలోకి ఆహ్వానించేవారు.
అసదుద్దీన్ ఓవైసీపై రాజా సింగ్ చేసిన ఆరోపణలలో నిజానిజాలు ఎన్.ఐ.ఏ., పోలీసులకి, ప్రభుత్వానికే తెలియాలి. అయితే జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అధికారం కోసం భాజపా కూడా పి.డి.పి.తో పొత్తులు పెట్టుకొని, దాని నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉందనే విషయం మరిచిపోకూడదు. వేర్పాటువాదులని, ఉగ్రవాదులని, పాకిస్తాన్ని విపరీతంగా అభిమానించే పి.డి.పి.తో భాజపా కలిసి పనిచేయడం తప్పు కానప్పుడు ఐసిస్ ఉగ్రవాదాన్ని బహిరంగంగా ఖండిస్తున్న మజ్లీస్ పార్టీతో తెరాస పొత్తులు పెట్టుకొంటే తప్పేముంది?