తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ .. అంతర్జాతీయ టెర్రరిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. ఆగస్టు పదిహేనో తేదీన కొంత మంది టెర్రరిస్టులను బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో.. వారి వద్ద లభించిన పత్రాల్లో రాజాసింగ్‌ను టార్గెట్ చేసుకున్నట్లుగా తేలింది. ఈ మేరకు కేంద్ర నిఘా సంస్ధల నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సమాచారం రావడంతో.. ఆయనకు సెక్యూరిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డీసీపీ స్థాయి అధికారితో భద్రత ఏర్పాటు చేశారు. పవర్ ఫుల్ ఆయుధాలతో ఆయన ఇంటి వద్ద పహారా ప్రారంభించారు.
రాజాసింగ్ ధనవంతుడైన ఎమ్మెల్యే కాదు. ఆయన పాతబస్తీలోనే ఉంటారు. అక్కడ రోడ్లు కార్లు కూడా పట్టనివి. అందుకే ఆయన ఎక్కువగా బైక్‌పై తిరుగుతూ ఉంటారు. అనేక మంది ఆయన ఇంటికి వచ్చిపోతూ ఉంటారు. పోలీసులు ఇప్పుడు ఆంక్షలు విధించారు. బైక్‌పై తిరగవద్దని… ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణించాలని తేల్చి చెప్పారు. అయితే.. రాజాసింగ్.. తాను గతంలోనే భద్రతపై ఆందోళన వ్యక్తం చేసి.. గన్ లైసెన్స్ అడిగానని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడైనా గన్ లైసెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముప్పు విషయంలో కేంద్రం, ఐబీ, ఇంటలిజెన్స్ నుంచి తనకు తరచూ ఫోన్ కాల్స్ రాజాసింగ్ చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో రాజాసింగ్ కరుడుగట్టిన హిందూత్వ వాదంతో తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. అయన స్టేట్మెంట్ల దెబ్బకు.. ఫేస్బుక్ కూడా ఓ సారి షేకైపోయింది. ఎంఐఎంపై ఎదురుదాడి చేయడంలో ఆయన ముందు ఉంటారు. ఆయన చేసే ప్రకటలన్నీ దాదాపుగా విద్వేష పూరితంగానే ఉంటాయి. అది ఆయన శైలి. అందుకే… టెర్రరిస్టుల దృష్టిలో పడ్డారని అనుకుంటున్నారు.