ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముజఫర్ నగర్ లోని దాద్రి అనే గ్రామంలో ఆవు మాంసం తిన్నాడనే అనుమానంతో మహమ్మద్ అఖ్లాక్ అనే ఒక ముస్లిం వ్యక్తిని కొందరు కొట్టి చంపిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సంఘటనపై ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక “ది హిందూ” లో ఒక పరిశోధనాత్మక కధనం వచ్చింది. ఆ ముస్లిం వ్యక్తిపై దాడికి నేతృత్వం వహించిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే అతను, మరొక వ్యక్తి మొయినుద్దీన్ ఖురేషీ అనే ఒక ముస్లిం భాగస్వామితో కలిసి ‘అల్ దువా ఫుడ్ ప్రాసెసింగ్’ అనే ఒక మాంసం ఎగుమతి కంపెనీని నడిపిస్తున్నట్లు ది హిందూ పత్రిక పేర్కొంది. ఆ కంపెనీ భారతదేశంలో మాంసం ఎగుమతి కంపెనీలలో అగ్రస్థానంలో ఉందని వెల్లడయింది. ఆ సంస్థ ప్రధానంగా ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు వంటి జంతువుల మాంసం ఎగుమతి చేస్తుందని పేర్కొంది. అందులో తను ఒక డైరెక్టర్ గా ఉన్నానని ఆ బీజేపీ ఎమ్మెల్యే అంగీకరించారు.
హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా గోవధ నిషేధం అమలు జరగాలని కోరుతున్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యే స్వయంగా అటువంటి వ్యాపారం చేస్తుండటమే విచిత్రం అనుకొంటే, అతను గోవధ నిషేధం గురించి ఉద్యమించడం, ఆ ప్రయత్నంలో ఒక ముస్లిం వ్యక్తి హత్యకు కారకుడవడం చాలా దారుణం. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ నీతి నియమాలు, న్యాయం ధర్మం గురించి అనర్గళంగా ప్రసగిస్తుంటారు. కానీ బీజేపీలో ఇటువంటి వ్యక్తులున్నారు. యధారాజా తధాప్రజా అన్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ద్వంద వైఖరి అనుసరిస్తుంటే సదరు ఎమ్మెల్యే కూడా ఆయనలాగే ఒకవైపు మాంసం ఎగుమతి వ్యాపారం చేస్తూ గోవధ నిషేధంపై పోరాడుతున్నారు. అధికారంలో ఉన్నవారు రాజధర్మం పాటించాలని మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఇదివరకు ఒకసారి నరేంద్ర మోడికి చెప్పారు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినపుడు మోడీ మౌనం వహించడం చూస్తుంటే రాజధర్మం పాటించడం అయన వలన కాదని స్పష్టం అవుతోంది.