ముద్రగడ పద్మనాభం దీక్ష విరమింపజేయడానికి చాలా కృషి చేసిన రాజమండ్రి రూరల్ భాజపా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెదేపా ప్రభుత్వంపై చాలా నిశితంగా విమర్శలు చేశారు. ముద్రగడ విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి కూడా వ్యతిరేక వైఖరితోనే వ్యవహరించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అది కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి చేసిన ప్రయత్నంగానే కాపులు భావిస్తున్నారని అన్నారు. అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తే ఏమవుతుంతో తెలుసుకోవాలంటే దేశంలో ఎమర్జన్సీ రోజుల తరువాత జరిగిన రాజకీయ పరిణామాలను ఒకసారి చూడటం మంచిదని అన్నారు. ముద్రగడ కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. ఒక ఉద్యమ నాయకుడి పట్ల ఈవిధంగా వ్యవహరిస్తే అది ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపుతుందని ప్రభుత్వం గ్రహించాలని అని హితవు పలికారు. ఈ మొత్తం వ్యవహారంలో ముద్రగడ పైచెయ్యి సాధించారా లేక ప్రభుత్వం సాధించిందా? అని ఆలోచించడం కంటే, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సరైన విధానం అవలంభించాలని సత్యనారాయణ కోరారు.
ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు కొంచెం కటువుగానే వ్యవహరించారని వీడియో క్లిప్పింగులు స్పష్టం చేస్తున్నాయి. దానిని ఎవరూ సమర్ధించరు. అది ప్రభుత్వ వైఖరికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. క్షమార్హం కాని తుని విధ్వంసం జరిగిన తరువాత కూడా ప్రభుత్వం చాలా సంయమనం పాటిస్తూ ముద్రగడ పట్ల మొదటిసారి ఎంతో మర్యాదగా, మృదువుగా వ్యవహరించిన సంగతి బహుశః సత్యనారాయణకి కూడా గుర్తు ఉండే ఉంటుంది. అదే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధంగా ఎందుకు వ్యవహరించిందో ముద్రగడ, ఆయనకి సంఘీభావం ప్రకటిస్తున్న భాజపా ఎమ్మెల్యే సత్యనారాయణ వంటివారు కూడా ప్రశ్నించుకోవడం మంచిది. ముద్రగడ తన ఉద్యమ లక్ష్యాన్ని మరిచిపోకుండా దానికే పరిమితం అయ్యుంటే సమస్య ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు. కానీ ప్రభుత్వం ఆయన డిమాండ్లను నేరవేరుస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులని మోసం చేశారంటూ విమర్శలు చేయడం, లేఖలు వ్రాయడాన్ని సత్యనారాయణ సమర్ధించగలరా? ఒకవేళ రాష్ట్రంలో భాజపా ప్రభుత్వమే ఉన్నట్లయితే, అప్పుడు ముద్రగడ ఈవిధంగా వ్యవహరిస్తే ఇదే విధంగా ఆయనని, ఆయన ఉద్యమాన్ని, తుని విధ్వంసాన్ని సమర్ధించగలరా? ఇంతకీ తుని విధ్వంసానికి బాధ్యులు ఎవరో ఇప్పటికీ ముద్రగడతో సహా ఎవరూ చెప్పడం లేదు. సిబిఐ విచారణ కూడా వద్దంటున్నారు? ఎందువల్ల?
నిజమే! ముద్రగడ విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి చివరి వరకు కూడా చాలా తప్పటడుగులు వేసింది. కానీ ముద్రగడ కూడా ఎందుకు తప్పటడుగులు వేశారు? నిన్న కిర్లంపూడిలో దీక్ష విరమించిన తరువాత ఆయన మాట్లాడిన మాటలైనా సమర్ధనీయంగా ఉన్నాయా? ఇకపై కాపు జేయేసి నేతృత్వంలో పోరాడుతామని చెప్పడానికి అర్ధం ఏమిటి? ఇంతవరకు తను చేసిన పోరాటం సరైనది కాదనే కదా అర్ధం. కాపు నేతలని, ప్రజలని కలుపుకొని చేయవలసిన పోరాటాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి చేయడం పొరపాటేనని ఆయన అంగీకరించినట్లే అయ్యింది కదా?
ఏ ఉద్యమంలోనైనా సంబంధిత వర్గాల ప్రజలని, సంఘాలని, నేతలని కలుపుకొని లక్ష్యం వైపే ముందుకు సాగుతునంత కాలం ఎవరూ దానిని వేలెత్తి చూపలేరు..అడ్డుకోలేరు. కానీ ఆ లక్ష్యాన్ని, ప్రజలని మరిచి దానిలోకి రాజకీయాలను జొప్పిస్తే దాని ఫలితాలు ఇలాగే ఉంటాయి. కనుక ఇకనైనా ముద్రగడ రాజకీయ పార్టీలని, వాటి నేతలని ఆశ్రయించడం కంటే తన వర్గం ప్రజలు, సంఘాలు, నేతలతో కలిసి ముందుకు సాగడం మంచిది. ఆయన లక్ష్యం కాపులకి రిజర్వేషన్లు సాధించడం మాత్రమే అయితే, అందుకు అంగీకరిస్తున్న ప్రభుత్వంతో యుద్ధం చేయాలని ఆలోచించకుండా, దానికి అన్ని విధాల సహకరించి తన ఆశయం నెరవేర్చుకోవడం అందరికీ మంచిది. తన పోరాటానికి మద్దతు కోరుతూ ముద్రగడ ప్రతిపక్ష నేతలని కలవడం కంటే తన పంతాలని, పట్టింపులని అనవసరమైన రాజకీయాలని అన్నిటినీ పక్కనపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి మాట్లాడటం వలననే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. ఆయన కాదన్నపుడే ఆయన ప్రతిపక్ష నేతలని కలవాలి తప్ప హామీలు అమలుచేస్తానని ముఖ్యమంత్రి చెపుతున్నప్పుడు కాదు.