అందని ద్రాక్ష పుల్లన అని చిన్నప్పుడు పాఠాల్లో చదవుకుంటాం..! జీవితంలో అదే నిజమని.. మనకు మనం తెలుసుకుంటామో లేదో కానీ.. ఎదుటి వాళ్లు మాత్రం.. తమ చేష్టలతో తరచూ నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో రాజకీయ నేతలు ఎక్కువగా ఉంటారు. తాజాగా.. దీన్ని పక్కాగా నిరూపిస్తున్నారు… బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీజేపీకి కటిఫ్ చెప్పిందో అప్పటి నుంచి ఆయన మాటలు.. ఏ రోజు ఎలా ఉంటాయో ఎవరికీ అర్థం కాదు. ఓ రోజు.. తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించేసి..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని.. తేల్చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏదో పని మీద.. సెక్రటేరియట్ లో చంద్రబాబును కలిసి… సీఎం భలే పని చేస్తున్నారని సర్టిఫికెట్ ఇస్తారు.
తెలుగుదేశం పార్టీకి తాను దగ్గర అన్నట్లుగా స్టేట్ మెంట్లిస్తారు. పని అయిపోయిన తర్వాత మళ్లీ… టీడీపీ నుంచి పోలోమంటూ.. నేతలంతా.. వైసీపీలో చేరబోతున్నారని చెప్పుకొస్తారు. అదేమిటండి.. మీరు బీజేపీలో ఉన్నారు… చేరితే మీ పార్టీలో చేరుతారని చెప్పాలి కానీ… వైసీపీలో చేరుతారని చెప్పడమేమిటని… ఎవరైనా అడిగితే… అలా నవ్వేస్తారు. ఆ నవ్వులో నేను.. కూడా వైసీపీలో చేరుతున్నా కదా.. అనే అర్థం వెదుక్కోవాలి మనం. ఇన్ని రోజులు ఇలాంటి స్కిట్లు చేసిన తర్వాత కొద్ది రోజుల క్రితం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా కానీ.. ఏ పార్టీ నుంచో చెప్పను అంటూ ప్రకటించేశారు. దాంతో.. ఆయన ఎక్కడ చాన్స్ వస్తే అక్కడ చేరిపోతారని అనుకున్నారు. కానీ ఎక్కడా చాన్స్ వచ్చే అవకాశం లేదని తేలిపోయినట్లు ఉంది.
అందుకే… ఇప్పుడు కొత్తగా బీజేపీ నుంచే పోటీ చేస్తానన ప్రకటించేశారు. టీడీపీ, వైసీపీలపై విమర్శలు ప్రారంభించారు. దాంతో సరిపెట్టలేదు.. తన లాంటి నేతల్ని ఎన్నుకకపోతే ప్రజలకే నష్టమని… తనకేం నష్టం లేదని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడం ప్రారంభించారు. మొత్తానికి.. విష్ణుకుమార్ రాజు.. అందరి ద్రాక్ష పుల్లన అని మరోసారి నిరూపిస్తున్నారు.