ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తా కానీ.. ఏ పార్టీ నుంచో మాత్రం ఇప్పుడే చెప్పనని ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ప్రకటిస్తారు. ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదు, ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తే.. ఆయన బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదని మాత్రం చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి విష్ణుకుమార్ రాజు.. వ్యవహారశైలి బీజేపీ నేతలకు.. తలనొప్పిగానే ఉంది. ఒక్కోసారి బీజేపీ … చాలా గొప్పగా సమర్థించే ఆయన ఆ తర్వాత రోజే… టీడీపీ అధినేత చంద్రబాబును ఆకాశానికెత్తేస్తారు. ఆ తర్వాత మళ్లీ జగన్ వంతు వస్తుంది. పొగడ్తలే కాదు… వరుసగా విమర్శలు చేస్తూ… ఉంటారు.
తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏకు కటిఫ్ చెప్పినప్పటి నుంచి విష్ణుకుమార్ రాజు.. రాజకీయ భవిష్యత్ కోసం.. ఇతర పార్టీల వైపు చూస్తూనే ఉన్నారని చెబుతున్నారు. మొదట్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడారు. జగన్ పాదయాత్ర విశాఖ వచ్చినప్పుడు ఆయనను కలుస్తానని ప్రకటించారు. కానీ.. వైసీపీతో సంప్రదింపులు ఫలించినట్లుగా లేదు. అందుకే ఆయన… జగన్ పాదయాత్ర విశాఖ వచ్చి వెళ్లిపోయిన తర్వాత కూడా.. జగన్ ను కలవలేదు. దాంతో.. వైసీపీలో ఆయనకు దారులు మూసుకుపోయినట్లు తేలిపోయింది. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ.. టీడీపీలో చేరడానికి విశాఖ నుంచి చాలా మంది సీనియర్ నేతలు లైన్లో ఉన్నారు కాబట్టి.. విష్ణుకుమార్ రాజుకు.. టీడీపీ అవకాశం ఇవ్వడం కష్టమే. ఇప్పటికే విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి సబ్బం హరి పేరు టీడీపీ తరపున వినిపిస్తోంది.
మొత్తానికి . . ఎన్నికల వేడి పెరిగే కొద్దీ.. భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిణామాలు మరిన్ని ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే.. ఆకుల సత్యనారాయణ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. విష్ణుకుమార్ రాజు అదే చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్ ఎప్పుడో అస్త్రసన్యాసం ప్రకటించారు. ఇక మిగిలిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మాణిక్యాలరావు పోటీ చేస్తారో లేదో అన్న ప్రచారం జరుగుతోంది.