ఈ మాట భాజపా నేత సోము వీర్రాజు అని ఉంటే పెద్దగా చర్చ జరిగేది కాదు! ఎందుకంటే, తెలుగుదేశం సర్కారుపై ఆయన విమర్శలు అనేవి కొంత రొటీన్ వ్యవహారం అయిపోయిది. కానీ, ఇప్పుడు మాట్లాడింది ఎవరంటే… భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు! సోము వీర్రాజు, పురందేశ్వరి, కన్నా వంటివారు మిత్రపక్షమైన టీడీపీపై విమర్శలు చేస్తుండటం చూస్తున్నాం. కానీ, టీడీపీకి కొంత అనుకూలంగా ఉంటారు అనే ముద్ర ఉన్న భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయం ఇప్పుడు అవుతోంది!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైకాపా నేతలతోపాటు, భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. అనంతరం వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రరెడ్డితోపాటు, విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆయన ఫైర్ అయ్యారు. జంప్ జిలానీలకు మంత్రి పదవులు ఇవ్వడం సరికాదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరిపైనా వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ విష్ణు డిమాండ్ చేశారు. వైకాపా బీఫామ్ మీద గెలిచి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా… మరోపక్క మంత్రులుగా కొంతమంది కొనసాగుతుండటం సరైంది కాందంటూ మండిపడ్డారు. జంప్ జిలానీ నేతలు మంత్రులుగా కొనసాగడం అనైతికమనీ, ఒకవేళ వారిని కొనసాగించాలనుకుంటే దానికి అనుగుణంగా ఒక చట్టం చేసేయండీ అంటూ ఎద్దేవా చేశారు. ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చేసిన కామెంట్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రత్యేక హోదా విషయంలో స్పష్టత ఇస్తే.. భాజపాతో పొత్తుకు సిద్ధమంటూ వైకాపా అధినేత జగన్ ఓ ఇంటర్య్వూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే రకరకాల అభిప్రాయాలూ విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. సరిగ్గా, ఇలాంటి తరుణంలో భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిరాయింపులపై ఇలా వ్యాఖ్యానించడం విశేషం. అయితే, ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే… జంప్ జిలానీల అంశం కొత్తదేం కాదు. లేదంటే, ఇవాళ్లే కొత్తగా ఆ నలుగురు వైకాపా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను చంద్రబాబు కట్టబెట్టలేదు. ఇవన్నీ జరిగి చాన్నాళ్లయింది. ఇదేదో కొత్త అంశం అన్నట్టుగా ఇప్పుడు విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యానించడం విశేషం! ఇంకోపక్క… ఈ అంశాన్ని వైకాపా కూడా ఈ మధ్య కొంత పక్కన పెట్టేసింది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిందే ఫిరాయింపు నేతలపై పోరాటం కోసం అని ఆ మధ్య అన్నారు. మరి, ఆ పోరాటం ఏంటో, ఎక్కడ జరుగుతోందో, ఏ మాధ్యమంలో చేస్తున్నారో అనేది ఆ పార్టీ నేతలకే తెలియాలి.
ఓ పక్క భాజపాతో పొత్తుకి తాను సిద్ధమే అని జగన్ అనడం, ఇదే సందర్భంలో వైకాపాను వెనకేసుకొచ్చే విధంగా ఫిరాయింపులపై విష్ణుకుమార్ రాజు కామెంట్స్ చేయడం విశేషం! మొత్తానికి, రాష్ట్రస్థాయిలో భాజపాతో వైకాపా పొత్తు విషయమై కొంత చర్చకు తెరలేచిందనే చెప్పుకోవచ్చు. మరి, ఈ వ్యాఖ్యలన్నీ కేంద్ర నాయకత్వం అనుమతితో భాజపా నేతలు చేస్తున్నారా, లేదంటే ఇది రాష్ట్రనేతల స్పందనగా మాత్రమే చూడాలా అనేదే ప్రశ్న..?