తెలంగాణలో బోలెడన్ని పథకాలు ఉన్నాయి. మేము తెలంగాణలో కలిసిపోతామని తెలంగాణలో బోర్డర్ లో ఉన్న మహారాష్ట్ర గ్రామాల నుంచి అప్పుడప్పుడు కొంత మంది బీఆర్ఎస్ ఆపీసుకు వచ్చి విజ్ఞాపన పత్రాలు ఇస్తూంటారు. వారిని చూపించి కేసీఆర్, కేటీఆర్.. మహారాష్ట్ర వాళ్లే తెలంగాణలో కలుస్తామంటున్నారని.. అట్లుంటది తమ పాలన అని చెప్పుకునేవారు. దాన్ని సీరియస్ గా తీసుకున్నారేమో కానీ జాతీయ పార్టీ పెట్టి మహారాష్ట్రలోనూ పోటీ చేయాలని కేసీఆర్ అనుకున్నారు..కానీ కాలం కలసి రాలేదు.
ఇప్పుడు రివర్స్ లో అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు తమ ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలని డిమాండ్ చేశారు. బయట ఎక్కడైనా ఈ డిమాండ్ చేసి ఉంటే సరే అనుకోవచ్చు కానీ..నేరుగా అసెంబ్లీలోనే అనేశారు. అసిఫాబాద్ జల్లా సిర్ఫూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఈ డిమాండ్ చేశారు. బడ్జెట్ పై చర్చలో పాల్గొన్న ఆయన వెనుకబడిన తమ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు నిధులు కేటాయించని పక్షంలో పక్కనే ఉన్న మహారాష్ట్రలో తమ జిల్లాను కలిపేయమని డిమాండ్ చేశారు. తమ ఆవేదనను సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నామని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం శాసనసభ కమిటీ వేయాలని, వెనకబాటుతనంపై అధ్యయన మరియు పరిష్కార మార్గాలు సూచించాలని కోరారు.
Also Read : ప్రతిపక్ష నేత లేకపోయినా తెలంగాణ అసెంబ్లీలో హాట్ డిబేట్స్
గత ప్రభుత్వం కేవలం దక్షిణ తెలంగాణకు నీళ్లు తరలించి ఉత్తర తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని వాటిని సవరించాలన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చలేకపోతే కొమురంభీం జిల్లాను మహారాష్ట్ర లో కలిపేయాలని.. కనీసం ఆ రాష్ట్రంలో చేరితే అయిన మా ప్రాంతం అభివృద్ది చెందుతుందేమో అని ఆవేదన వ్యక్తం చేశారు. మా పక్కనే ఉన్న చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలను మహారాష్ట్ర అభివృద్ది చేస్తోందని వాటితో పాటు అభివృద్ధి చెందుతామని అంటున్నారు. ఆయన మాటలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో కానీ.. ఓ సారి ఇవే సమస్యలతో రేవంత్ రెడ్డిని కూడా కలిశారు హరీష్ బాబు.