ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఇతర పార్టీల నుండి నేతలను చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నేతల మీద ఫోకస్ పెట్టినప్పటికీ, వై ఎస్ ఆర్ సి పి, కాంగ్రెస్ నేతలతో పాటు ఇటీవల కాలంలో రాజకీయంగా చురుకుగా లేని కొందరు నేతలను కూడా సంప్రదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయం మీద మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన అనేక నేతలు తమతో, అంటే రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నారని, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో టచ్ లో ఉన్నారని, ఆయనే కాకుండా చాలా మంది ఇతర పార్టీలకు చెందిన నేతలు తమ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని బీజేపీ నేత మాధవ్ వ్యాఖ్యానించారు. మరి చిరంజీవి కూడా మీతో టచ్ లో ఉన్నారా అని విలేకరులు ప్రశ్నించగా ఆయన దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. చిరంజీవి తో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకత్వం టచ్లో లేదని, బహుశా బీజేపీ కేంద్ర స్థాయి నాయకులు ఆయన తో సంప్రదింపులు జరిపి ఉండవచ్చేమో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ మధ్య చిరంజీవి ని బీజేపీలోకి ఆకర్షించడానికి ప్రయత్నాలు జరిగాయని, బీజేపీ వ్యూహకర్త రామ్ మాధవ్ చిరంజీవి తో సుదీర్ఘ చర్చలు జరిపి చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానించారని, దానిని చిరంజీవి సున్నితంగా తిరస్కరించాడని వార్తలు వచ్చాయి. బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బాబు సైతం ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, బీజేపీ చిరంజీవి కోసం ప్రయత్నాలు గతంలో చాలాసార్లు చేసిందని, ఈ మధ్య కూడా చేసిందని, భవిష్యత్తులో కూడా చేస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
రాజకీయ నాయకులు చాలా సందర్భాలలో చిరంజీవి పేరు ప్రస్తావించినప్పటికీ, ఆయన మాత్రం రాజకీయాల మీద నోరు మెదపడం లేదు. ప్రస్తుతం తన దృష్టంతా తన తదుపరి సినిమా సైరా నరసింహారెడ్డి పైన ఉన్నట్లు తెలుస్తోంది.