మహారాష్ట్రంలో సీఎంగా ఫడ్నవీస్ ఉన్న 80 గంటల్లో.. రూ. 40వేల కోట్లను… ఆ రాష్ట్రానికి కాకుండా వెనక్కి పంపేశారా..? అవుననే అంటున్నారు..బీజేపీకే చెందిన ఎంపీ అనంతకుమార్ హెగ్డే. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే మెజార్టీ తమకు లేదని తెలిసినా… పడ్నవీస్ సీఎం అయ్యారని దానికో డ్రామా ఉందని ఆయన బహిరంగంగా చెప్పుకొచ్చారు. శివసేన – ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి నేరుగా అధికారానికి వస్తే అభివృద్దికి కేటాయించిన రూ. 40వేల కోట్లు నిధులు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని బీజేపీ భావించిందట.
అందుకే మెజార్టీ లేకపోయినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. విశ్వాస పరీక్షలో నెగ్గే అవకాశం లేదని తెలిసి కూడా సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టారని హెగ్డే అంటున్నారు. అనుకున్నట్లుగా.. ఫడ్నవీస్ రూ. 40వేల కోట్లను కేంద్రానికి పంపేశారట. అనంత్ కుమార్ హెగ్డే ప్రకటనతో బీజేపీలో ఒక్క సారిగా ప్రకంపనలు వచ్చాయి. ఫడ్నవీస్ స్వయంగా వివరణ ఇచ్చుకోక తప్పలేదు. పదవిలో ఉన్న 80 గంటల్లో తాను ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. తమ పార్టీ ఎంపీ చేసిన వాటిని తప్పుడు ఆరోపణలుగా కొట్టిపారేశారు.
అంతే కాదు… ఎలాంటి అనుమానాలున్నా హెగ్డే వ్యాఖ్యలపై విచారణ చేసుకోవచ్చని ధాకరేకు ఫడ్నవీస్ సలహా కూడా ఇచ్చారు. ఒక్క పైసా కూడా కేంద్రానికి వెనక్కి ఇవ్వలేదని ఫడ్నవీస్ నెత్తి నోరు బాదుకుని చెబుతున్నారు. ఇలాంటి అవకాశం వస్తే.. సేన- ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి ఎందుకు ఊరుకుంటుంది. బీజేపీ మహారాష్ట్రకు వ్యతిరేకమనే ప్రచారం ప్రారంభించింది. ఇప్పుడు దీన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక బీజేపీ తంటాలు పడే పరిస్థితికి వచ్చింది.