తెలంగాణలో పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల ప్రచారంతో పాటు మాటల వేడి కూడా పెరుగుతోంది.
అయితే, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ అడుగు ముందుకేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని జోస్యం చెప్పారు. రేవంత్ సర్కారు అబద్దపు హామీలతో గద్దెనెక్కిందని, ఈ సర్కార్ కూలిపోవటం ఖాయమన్నారు.
ఈ సర్కార్ కూలిపోవాలని మహిళలు పూజలు చేయాలని వ్యాఖ్యానించిన అరవింద్… ఈ సర్కార్ ను కూల్చేది బీజేపీ కాదని, కాంగ్రెస్ నేతలే కూల్చేస్తారన్నారు. మొన్నటి వరకు ఈ ప్రభుత్వం ఉండదంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కామెంట్ చేయగా, ఇప్పుడు ఎంపీ అరవింద్ కూడా అదే అంశాన్ని ప్రస్తావించటం చర్చనీయాంశంగా మారింది.
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిలదొక్కుకునేలా లేవని… ఏక్ నాథ్ షిండేలు పుట్టుకొస్తారని ప్రచారం అభిప్రాయం ఉన్న నేపథ్యంలో, బీజేపీ నేతలంతా రేవంత్ సర్కార్ కూలిపోతుందని కామెంట్ చేయటం రాజకీయంగా మరింత వేడిని రగిల్చే అవకాశం ఉంది.
చివరి రెండు రోజుల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఇదే అంశంగా బీజేపీని టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా కనపడుతోంది.