లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా వాదిస్తున్నారు. ఎక్కడ చూసినా మోడీ నామస్మరణతోనే బీజేపీ నేతలు ప్రజల వద్దకు వెళ్తూ ఓట్లు అడుతున్నారు. కానీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆ పార్టీకి షాక్ ఇచ్చింది.
ఈ ఎన్నికల్లో మోడీ వేవ్ లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం భాగంగా బీజేపీ శ్రేణులతో సమావేశమైన ఆమె మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి పని చేయాలని, ఈసారి మోడీ వేవ్ లేదని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో మోడీ ఛరిష్మా పని చేసిందని ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదని వెల్లడించింది.
నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో మోడీ వేవ్ లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్సీపీ మద్దతుతో గెలుపొందారు. తర్వాత బీజేపీలో చేరిన ఆమె ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. బీజేపీ నేతగా ఆమె మోడీ హావా లేదని చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో వివరణ ఇచ్చుకుంది.
తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని.. మోడీ సారధ్యంలోనే ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పుకొచ్చింది. నిజానికి నవనీత్ కౌర్ వ్యాఖ్యలు కొట్టిపారేసేలా ఏమి లేవని అంటున్నారు విశ్లేషకులు. సౌత్ లో మోడీ వేవ్ లేదని..అదే విషయాన్నీ ఆమె స్పష్టం చేసిందంటున్నారు. కానీ, ఆమె వ్యాఖ్యలు పార్టీకి కొంత ఇబ్బందికి గురి చేసేవే.