జీవీఎల్ నరసింహారావు… ఈయన ఎవరంటారా..? అదేంటీ.. ఆయన ఆంధ్రాకే చెందిన నేతే! అదెప్పట్నుంచీ అంటారా… సరే, ఇప్పట్నుంచే అనుకోండి, తప్పేముంది..! జీవీఎల్ హఠాత్తుగా ఆంధ్రా నేత అయిపోయారు..! రాష్ట్ర ప్రజల తరఫున వకాల్తా పుచ్చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు! ఇన్నాళ్లూ ఎక్కడున్నారో తెలీదు, ఆంధ్రా సమస్యలతో ఆయనకి ఎలాంటి అనుభవం లేదు. కానీ, ఇవాళ్ల ఏపీ భాజపా నేతగా అవతారం ఎత్తేసి… పార్లమెంటులో రాజకీయ పార్టీల బాధ్యతల గురించి, ఏపీలో భాజపా చేసిన అభివృద్ధి గురించి, టీడీపీ పాలనలో లోపాల గురించి మాట్లాడుతుంటే.. విడ్డూరంగా అనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా భాజపా ఎంపీలు ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాజపా ఎంపీ జీవీఎల్ ఆంధ్రాకి వచ్చేశారు! విజయవాడలో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్లమెంటు ఒక పుణ్యక్షేత్రం లాంటిదనీ, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదిక అని ఆయన చెప్పడం జరిగింది! అలాంటి పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రతిపక్షాలు రౌడీ రాజకీయాలు చేశారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దానికి నిరసనగా దీక్షలు చేపట్టామనీ, ఆంధ్రాకు హోదాతో సమానంగా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశామని మరోసారి ఆయన చెప్పడం జరిగింది. జీవీఎల్ ఓ గమ్మత్తైన ప్రశ్న వేశారండోయ్..‘పార్లమెంటులో వెల్ లోకి వెళ్లి చర్చ జరగనీయకుండా చేసిందెవరు..? మీరు, మీ ప్రాంతీయ పార్టీలు కాదా’ అని వ్యాఖ్యానించారు. ఇది ఒకటే భారతదేశమనీ, అన్ని రాష్ట్రాలకూ న్యాయం చేయాలన్నది కేంద్రం అభిమతం అని జీవీఎల్ చెప్పడం జరిగింది. ప్రజలకు వాస్తవాలు తెలుసనీ, భ్రమ రాజకీయాలు ఎక్కువ కాలం సాగవన్నారు..! తెలుగుదేశం కూడా కాంగ్రెస్ తో కలిసిపోయిందని కూడా విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఆ పార్టీలోనే ఉండేవారు కదా అనే దృగ్విషయాన్ని జీవీఎల్ ప్రస్థావించడం జరిగింది.
హాస్యాస్పదమైన అంశం ఏంటంటే… పార్లమెంటులో చర్చ జరగనీయకుండా అడ్డుకున్నది మీ ప్రాంతీయ పార్టీలు కాదా అని జీవీఎల్ ప్రశ్నించడం! ఆ పార్టీలకు దర్శకత్వం వహించింది భాజపా అనే విషయం ప్రజలకు తెలియదని జీవీఎల్ అనుకుంటే ఎలా..? పార్లమెంటు గొప్పతనం గురించి జీవీఎల్ మాట్లాడుతుంటే… దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తోంది. పార్లమెంటరీ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే… కేంద్రంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు చర్చించలేకపోయారు..? ఎందుకు తప్పుకుని పారిపోయారు..? అవిశ్వాస తీర్మానం ప్రజా సమస్యల్లోంచి పుట్టింది కాదా..? ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా..? ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ కలిసిపోయాయనే విమర్శ ప్రధానంగా లేవనెత్తుతున్నారు. అంటే, రెంటినీ ఒక గాటన కట్టేస్తే… భాజపాకి ఆంధ్రాలో కొంత చోటు దొరుకుతుందనే వ్యూహంలా కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఎక్కడున్నారో అడ్రస్ లేని జీవీఎల్, ఆంధ్రాతోగానీ ఇక్కడి ప్రజల మనోభావాలతోగానీ ఏమాత్రం పరిచయం లేని జీవీఎల్… ఇవాళ్ల ఏపీ భాజపా నేత అవతారంలో విజయవాడ వచ్చేసి, సొంత రాష్ట్రం కోసం ఏదో పోరాటం చేస్తున్న కలర్ ఇస్తుంటే.. చూడ్డానికి బాగా ఎబ్బెట్టుగా కనిపిస్తోందండీ! కనీసం, హరిబాబు లాంటివాళ్లు విమర్శించినా.. కొంత లోకల్ కనెక్టివిటీ ఉండేది కదా!