ఉత్తరప్రదేశ్లో ఎలాగైనా గెలిచి కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలనుకున్న బిజెపి కైరానా పట్టణం నుంచి హిందూ కుటుంబాలు వలస అంటూ మొదలుపెట్టిన ప్రచారం బెడిసికొడుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తం 346 హిందూ కుటుంబాలు ముస్లిం దాడుల కారణంగా భయంతో వెళ్లిపోయాయని స్థానిక బిజెపి ఎంపీ హుకుం సింగ్ చేసిన ప్రకటనలో విషయాలు రోజురోజుకు అవాస్తవాలుగా తేలిపోతున్నాయిు. ఈయన మాజీ కేంద్రమంత్రి, ముజఫర్నగర్ మతకలహాల కేసులో నిందితుడు కూడా. ఈ ఎంపీ విడుదల చేసిన 346 కుటుంబాల జాబితాపై చర్యలు తీసుకోవల్సిందిగా జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా పంపింది. ఇవన్నీ అసత్య ప్రచారాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొట్టిపడేశారు. హుకుం సింగ్ ఆరోపణల నిజానిజాలు తెలుసుకోవడానికి అక్కడకు వెళ్లి వివరాలు సేకరించిన హిందూ, హిందూస్తాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియాలతో సహా అన్ని పత్రికలు అసలు వివరాలు ప్రకటించాయి. హుకుం సింగ్ ఇచ్చిన జాబితాలో ప్రమోద్ జైన్ కుటుంబం మొత్తం వలస వెళ్లిపోయింది. కానీ ఆయన కైరానాలో ఉంటున్నాడు. సోను కూడా బలవంతాన పంపివేయబడినట్లు సింగ్ చెప్పింది అసత్యమే. అతను అక్కడే ఉంటున్నాడు..
ముఖీమ్ కాలా అనే ముస్లిం ముఠా నాయకుడు కొంత కాలం కిందట హిందూ వ్యాపారవేత్త సోదరుడిని హత్య చేశాడు. తర్వాత తనను గత ఏడాది అక్టోబర్లో అరెస్టు చేశారు. నిజానికి అతను ముగ్గురు హిందువులను, 11 మంది ముస్లింలను కూడా హత్య చేసిన కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ఇప్పటికీ 350 హిందూ కుటుంబాలు అక్కడి ముఖంకాలా అనే చోట నివాసం ఉంటున్నాయి. మొత్తం లక్ష జనాభ వున్నా ఆర్థికాభివృద్ధికి నోచుకోని కైరానా పట్టణం నుంచి పనుల కోసం అదికూడా అధిక కూలీ రేటు లభించే చోట్లకు శ్రామికులు వలస వెళ్లారని పోలీసు డిజిపి జావీద్ అహ్మద్ స్పష్టం చేశారు. తాము హుకుం సింగ్ జాబితాలో దాదాపు సగం వరకూ ప్రత్యక్ష విచారణ జరిపామని ఆయన తెలిపారు. బిజెపి కార్యకర్తల్లోనూ కొంతమంది ఈ ప్రకటనను తప్పుపట్టారు. పనులు వెతుక్కుంటూ 5,10 సంవత్సరాల కిందట చాలా కుటుంబాలు వెళ్లిపోయాయి తప్ప భయంతో కాదని పోలీసులు చెబుతున్నారు. ఈ జాబితాలో 15 మంది లాయర్లు కూడా ఉండగా అందరు నిక్షేపంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. దీనిపై వరుసగా నిజాలు బయిటకు వస్తుండటంతో హుకుం సింగ్ పాటమార్చేశారు. ఈ వలసలు మతం కారణంగా జరుగుతున్నట్టు తాను చెప్పలేదనీ, ఇంతమంది తరలి పోవడంపైవిచారణ జరపాలని మాత్రమే చెప్పానని అంటున్నారు. దీనిపై బిజెపి నాయకత్వం ఒక ప్రతినిధి వర్గాన్ని కూడా పంపిస్తున్నది. చివరకు రాజకీయ ప్రతిష్టకు భంగం కలగకుండా చివరకు వీరు ఎలాగో సర్దుబాటు చేస్తారన్నమాట. హుకుం సింగ్ తన కుమార్తెను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించడానికే ఈ కథలన్నీ వ్యాప్తి చేస్తున్నారని స్థానిక నేతలు మండిపడుతున్నారు.
.