ఏపీ భాజపా మాజీ అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు పార్లమెంటులో మాట్లాడారు. టీడీపీ నేతలు ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఆయన ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో వెనకేసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. ఆంధ్రాకి సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందనీ, కానీ రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్లనే సాయం అందలేదన్న పాత వాదనే మరోసారి వినిపించారు. ప్రత్యేక హోదాకి బదులుగా దానితో సమానమైన సాయాన్ని అందించేందుకు కేంద్రం ఎప్పుడో సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిందన్నారు.
స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తే… రూ. 17,500 కోట్లు ఇచ్చేందుకు మోడీ సర్కారు సిద్ధంగా ఉందన్నారు. ఇప్పుడు బ్యాంకు అకౌంట్ నంబర్ ఇస్తే…రేపు, అంటే శనివారం ఉదయం 11 గంటల్లోపు ఆ సొమ్మంతా ఆంధ్రా అకౌంట్ లో ఉంటుందన్నారు. ఏపీ ఎంపీలు ముందుగా అకౌంట్ నంబర్ ఇవ్వాలని కోరారు! కానీ, టీడీపీ సర్కారుకి రాష్ట్ర ప్రయోజనాలపై ఏమాత్రం ఆసక్తి లేదన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటోందన్నారు. తమతో కలిసి నాలుగేళ్లు ఉన్నారనీ, ఇప్పుడు రాజకీయ కారణాలు చూసుకుంటూ దూరమయ్యారనీ, తమతో టీడీపీ ఉన్నా లేకపోయినా ఆంధ్రా కోసం కేంద్రం ఉందన్నారు. ఏపీ ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు నరేంద్ర మోడీ సర్కారు సిద్ధంగా ఉందన్నారు.
ఆంధ్రాకి కేంద్రం ఇవ్వాల్సినవి ఐదంటే ఐదు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు. వాటిలో, గిరిజన విశ్వవిద్యాలయం ఒకటనీ, అది రాబోతోందన్నారు. రెండోది విశాఖ రైల్వేజోన్ అని హరిబాబు చెప్పారు. అది సాధ్యం కాదని రిపోర్టు వచ్చినా, ఏ విధంగా అయితే సాధ్యమౌతుందనే అంశమై ఒక కమిటీ వేశారనీ, త్వరలోనే రైల్వే జోన్ ను కేంద్రం ప్రకటిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని నివేదికలు వచ్చినా… సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతోందన్నారు, అది కూడా త్వరలోనే కేంద్రం ప్రకటించేస్తుందన్నారు. ఇక, దుగరాజపట్నం పోర్టు విషయానికొస్తే… ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించాలంటూ ఆంధ్రాని కేంద్రం కోరినా ఇంతవరకూ ఎవ్వరూ పట్టించుకోలేదంటూ జాప్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు.
ఇలా కేంద్రం చేశామని చెప్పుకున్నవి చెప్పారు! చేస్తామన్నవి అతి త్వరలో చేసేస్తుందని కేంద్రం తరఫున మాట్లాడారు. అయితే, భాజపా ఎంపీగా ఆయన మోడీ సర్కారుకు మద్దతుగా మాట్లాడటం ఎవ్వరూ తప్పుబట్టరు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజాప్రతినిధిగా రాష్ట్ర ప్రయోజనాల విషయమై సున్నితంగానే కేంద్రాన్ని డిమాండ్ చేయకపోవడం శోచనీయం. పెండింగ్ ఉన్న సమస్యల్ని, హామీల్నీ వెంటనే పూర్తి చేయండని మాటవరసకైనా అనకపోవడం గమనార్హం.