మాజీ క్రికెటర్ భాజపా రాజ్యసభ సభ్యుడు నవజ్యోత్ సింగ్ సిద్దు తన రాజ్యసభ సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని రాజ్యసభ చైర్మన్ వెంటనే ఆమోదించారు కూడా. ఆయన భాజపా తరపున రెండు నెలల క్రితమే రాజ్యసభకి నామినేట్ అయ్యారు. ఆయనకి ఆమాద్మీ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ శాసనసభ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ కూడా పోటీ చేస్తోంది. ఆ పార్టీ తరపున నవజ్యోత్ సింగ్ సిద్దు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. కనుక నేడోరేపో ఆయన భాజపాకి కూడా రాజీనామా చేయడం ఖాయమని చెప్పవచ్చు. ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్దు ప్రస్తుతం పంజాబ్ శాసనసభలో భాజపా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె కూడా భారత్తో బాటు భాజపాకి రాజీనామా చేసి ఆమాద్మీ పార్టీలో చేరిపోవడం కఖాయమనే చెప్పవచ్చు. నవజ్యోత్ సింగ్ సిద్దు 2004 నుంచి 2014 వరకు కూడా అమృత్ సర్ ఎంపిగా ఉన్నారు. ఆయనకీ రాష్ట్ర రాజకీయాలపై మంచి అవగాహన, పట్టు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఎన్నికలకి ముందు ప్రత్యర్ధి పార్టీలో చేరిపోతే భాజపాకి పెద్దదెబ్బే అవుతుంది.
భాజపా ఇంతవరకు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకి తన ముఖ్యమంత్రి అభ్యర్ధులని ఖరారు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ కి పార్టీ తరపున డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరుని ఖరారు చేసింది. ఈఎన్నికలతో పంజాబ్ లోకి కూడా ఆమాద్మీ పార్టీని విస్తరించాలని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకే నవజ్యోత్ సింగ్ సిద్దుని పార్టీలోకి రప్పించడం ద్వారా భాజపాని దెబ్బ తీయడమే కాకుండా, భాజపా కంటిని భాజపా వ్రేలితోనే పొడవచ్చని భావిస్తున్నట్లున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మొదట్లో సుపరిపాలన గురించి మాత్రమే మాట్లాడేవారు..ఆలోచించేవారు. కానీ ఇప్పుడు మిగిలిన పార్టీలలాగే రాజకీయాలు, అధికారం, పదవులు, ప్రచారం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నట్లు కనబడుతున్నారు.