శ్రీవారి వీఐపీ, ఆర్జిత సేవల దర్శనం కోసం తాము ఇచ్చిన లేఖల్ని టీటీడీ తీసుకోవడం లేదని తెలంగాణ నేతలు మరోసారి గళమెత్తారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తిరుమలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత .. చంద్రబాబు ఆదేశాలు అమలు కాలేదని విమర్శలు గుప్పించారు. ఫిబ్రవరి ఒకటి నుంచి సిఫారసు లేఖలు తీసుకుంటామని చెప్పారని ఇప్పుడు మార్చి సగం అయిపోయినా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వేసవి సెలవుల నాటికి సిఫారసు లేఖలు తీసుకోకపోతే ప్రజాప్రతినిధులతోనే వచ్చి తేల్చుకుంటానని హెచ్చరించారు.
రెండు రోజుల కిందట కొండా సురేఖ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆమె నేరుగా చంద్రబాబుకు లేఖ రాశారు. ఇంకా టీటీడీ తమ సిఫారసు లేఖల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. గతంలో నేతలంతా ఇలా వరుసగా ఆరోపణలు చేయడంతో చంద్రబాబు స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు. ఆ లేఖకు రిప్లయ్ ఇచ్చి.. ఫిబ్రవరి ఒకటి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల్ని అనుమతిస్తారని ప్రకటించారు.
అయితే టీటీడీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తెలంగాణ నుంచి ప్రజా ప్రతినిధులు వస్తే వారికి ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తున్నారు కానీ వారు ఇచ్చే సిఫారసు లేఖల్ని ఇంకా పరిగణనలోకి తీసుకోవడం లేదు. తిరుమల సిఫారసు లేఖలు అనేది వీఐపీలకు ఓ స్టేటస్. అ లేఖలు ఇస్తే.. చాలా మంది అనుచరుల్ని సంతృప్తి పరిచిన వారు అవుతారు. అయితే చంద్రబాబు ఆదేశాలను.. టీటీడీ ఇంకా ఎందుకు పాటించడం లేదో తెలియాల్సి ఉంది.