టైమ్స్ నౌలో తన ఉగ్రచర్చలతో ప్రైమ్‌టైమ్ బాహుబలిగా ప్రచారం పొందిన ఆర్నబ్ గోస్వామి కొత్తఛానల్ రిపబ్లిక్ టివి ఇటీవలే ప్రసారాలు ప్రారంభించింది. విశేషం ఏమంటే దీనికి ప్రధానంగా పెట్టుబడిపెట్టింది బెంగుళూరుకు చెందిన రాజీవ్ చంద్రశేఖర్ అనే రాజ్యసభ సభ్యుడు. ఆరంభంలోనే బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్ జైళ్లోని మాజీ ఎంపి షహాబుద్దీన్‌తో జరిపిన ఫోన్ సంభాషను బయిటపెట్టి సంచలనం సృష్టించింది రిపబ్లిక్. దీనిపై లాలూ గాని ముఖ్యమంత్రి నితిష్ గాని ఇంతవరకూ ఏమీ మాట్లాడలేదు. ఇది బయిటకు రావడంలో నితిష్ ప్రభుత్వ సహాయం వుందని ఆర్జేడీ అనుమానిస్తున్నది. ఆర్జేడీ జెడియు మైత్రిలో పొరపొచ్చాలు పెరగడానికి బిజెపి జోక్యానికి కూడా ఈ పరిణామం అవకాశం కల్పించింది. ఈ లోగా లాలూపై సుప్రీం కోర్టు తీర్పు కూడా రావడంతో పరిస్థితి ఇంకా దిగజారింది.
మరోసారి ఆర్బాబ్ గోస్వామిదగ్గరకు వస్తే బిజెపి ఎంపి పెట్టుబడుదల కారణంగానే గాక అంతకు ముందు చేసిన కార్యక్రమాల రీత్యా కూడా ఆయన ఆ పార్టీ పట్ట మెతక వైఖరి అనుసరిస్తారని ప్రేక్షకులు ట్విట్లర్లోనూ ఆయన జరిపిన ముఖాముఖిలోనూ సందేహాలు వెలిబుచ్చారు. ఇందుకు తగినట్టే బిజెపి కేంద్ర మంత్రులు కట్టగట్టుకుని ఆయన ఛానల్‌కు అభినందనల పరంపర ప్రకటించారు. మీది మితవాద ఛానల్‌గా వుంటుందా అన్న ప్రశ్నకు ఆర్బాబ్ జవాబివ్వడానికి నిరాకరిస్తున్నారు. దేశభక్తియుత, సైనిక అనుకూల ఛానల్‌గా వుంటుందని మాత్రం చెబుతున్నారు. మొదటి ప్రసారంలో ఆయన గతంతో పోలిస్తే కాస్త మెతగ్గా వున్నారనే అభిప్రాయం వచ్చింది. ప్యానల్ సభ్యులందరూ ఆయనతో ఏకీభవించినందువల్లనే ఇలా జరిగిందని వివరణ ఇస్తున్నారు గాని అలాటి వారినే ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్న దాని వెంటనే వస్తుంది.పెట్టుబడి పెట్టిన వారిని బట్టి కొంత మొదటే తేలిపోయినా ఆర్బాబ్ రెండవ అవతారం ఎలా వుంటుందన్నది బుల్లితెరపై చూడాల్సిందే.