బీహార్ ఎన్నికలలో బీజేపీ నేరస్తులకు టికెట్స్ ఇస్తోంది! ఈమాట అన్నది ఎవరో ప్రతిపక్ష నేత కాదు బీజేపీ ఎంపీ ఆర్.కె. సింగ్. వచ్చే నెల 12నుండి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక అన్ని పార్టీలు అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసి టికెట్ల పంపకాలు మొదలుపెట్టాయి. ఈ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న బీజేపీ గెలుపు గుర్రాలను వెతికి పట్టుకొనే ప్రయత్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని కాదని తమ పార్టీ నేరస్తులకు టికెట్స్ ఇస్తోందని ఆర్.కె. సింగ్ ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కొందరు పార్టీ నేతలు టికెట్స్ అమ్ముకొంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పట్టించుకోకుండా క్రిమినల్స్ కి, భారీగా డబ్బు ఆఫర్ చేస్తున్న వారికి టికెట్స్ కేటాయిస్తోందని ఆరోపించారు. ఎన్నికలలో ఖచ్చితంగా గెలవగలవారిని పక్కనబెట్టి, ఎవరో అనామకులకు నేరస్తులకు పార్టీ టికెట్స్ కేటాయిస్తున్నందున వారిలో చాలా మంది గెలిచే అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికయినా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని అర్హులకు, గెలిచే అవకాశం ఉన్నవారికి, పార్టీకి సేవ చేస్తున్న వారికే టికెట్స్ కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేసారు.
కానీ ఆయన ఆరోపణలను హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ కొట్టిపడేశారు. బీహార్ ఎన్నికలలో అర్హులకే పార్టీ టికెట్స్ ఇస్తున్నామని తెలిపారు. అంటే ఆర్.కె. సింగ్ చేస్తున్న ఆరోపణలను పార్టీ పట్టించుకొబోదని స్పష్టం చేసినట్లయింది. కానీ ప్రత్యర్ధ రాజకీయ పార్టీలు మాత్రం ఆయన చేసిన ఆరోపణలను తప్పకుండా పట్టించుకొంటాయని చెప్పవచ్చును. తమ ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన మాటలనే గట్టిగా ప్రచారం చేసి బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం చేయవచ్చును. కానీ నిత్యం నీతులు వల్లించే బీజేపీ ఎన్నికలలో ఎలాగయినా గెలవడం కోసం నేరస్తులకు టికెట్స్ ఇవ్వడం చాలా శోచనీయం. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని పూర్తిగా ప్రక్షాళనం చేస్తామని చెప్పుకొంటున్న నేరస్తులకే ప్రభుత్వ పగ్గాలు అప్పజెప్పబోతోందని ఆర్.కె. సింగ్ ఆరోపణలు తెలియజేస్తున్నాయి.