ఆర్టీసీ కార్మికుడు బాబు అంతిమ యాత్ర కరీంనగర్ లో తీవ్ర గందరగోళానికి కారణమైంది. అంతిమయాత్ర సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందంటూ భాజపా ఎంపీ సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యుడనైన తన గల్లా పట్టుకుంటారా అంటూ నిలదీశారు. మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారనీ, పార్లమెంటు సభ్యుడి మీద దాడి చేసే పరిస్థితి ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి అంటూ ప్రశ్నించారు. కార్మికులను కొట్టారనీ, మహిళల్ని కూడా గాయపరచారంటూ సంజయ్ అన్నారు. పోలీసు అధికారులే విద్రోహులుగా వ్యవహరించి, మఫ్టీలో వచ్చి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. శాంతియుతంగా అంతిమ యాత్ర చేయాలని నిర్ణయించుకుని వచ్చామనీ, తమ కార్యకర్తలకు కూడా అదే చెప్పామనీ, ఒక్కటంటే ఒక్క చోట కూడా తాము శాంతికి విఘాతం కలిగించేలా ప్రవర్తించకపోయినా తమపై దాడి చేశారంటూ మండిపడ్డారు.
ఆ తరువాత, కరీంనగర్ కోర్టు సర్కిల్ దగ్గర ఆర్టీసీ జేయేసీ నేతలు నిరసన తెలిపారు. ధర్నాగా సీపీ కార్యాలయానికి వెళ్లారు. ఎంపీ సంజయ్ పై దురుసుగా వ్యవహరించిన అధికారి మీద చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇవ్వడంతో ఆందోళన చల్లబడింది. అయితే, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేది లేదంటున్నారు భాజపా నేతలు. సంజయ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామనీ, ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు మాజీ ఎంపీ, భాజపా నేత వివేక్ వెంకటస్వామి. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామనీ, అంతేకాదు ఆర్టీసీ అంశంపై కూడా కేంద్రానికి వివరించి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. భాజపా నేతలంతా ఉద్యమంలో పాల్గొని, ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధనతోపాటు, ఎంపీ సంజయ్ దాడి వ్యవహారంలో సరైన చర్యలు తీసుకునే వరకూ పోరాటం చేస్తామన్నారు.
ఇన్నాళ్లూ ఆర్టీసీ సమ్మె కేవలం రాష్ట్రానికి సంబంధించి వ్యవహారంగా మాత్రమే ఉంది. కార్మికులకు మద్దతు ఇచ్చే స్థాయిలోనే రాజకీయ పార్టీలు ఉంటూ వచ్చాయి. కానీ, ఇప్పుడు ఎంపీ సంజయ్ చొక్కాని పట్టుకోవడంతో… దీనిపై భాజపా మరింత తీవ్రంగా స్పందిస్తోంది. ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. రాజకీయంగా ఇకపై భాజపా నేతల స్పందనలో రెండు యాంగిల్స్ ఉండే అవకాశం ఉంది. ఒకటీ… ఆయనపై ఏదైతే దాడి జరిగిందీ అంటున్నారో దాని సంబంధించిన చర్యలకు డిమాండ్. రెండోది.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, పార్లమెంటు సభ్యుడికే రక్షణ లేదంటూ కేంద్రం తక్షణం స్పందించాలనే డిమాండ్! ఇంకోపక్క, కాంగ్రెస్ పార్టీ కూడా పోలీసుల తీరును నిరసించింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలూ విమర్శలు చేశారు.