దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులందరూ 150 కిలో మీటర్ల పాదయాత్ర చేయాలని నిర్దేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మహాత్మా గాంధీ జయంతి.. అంటే, అక్టోబర్ 2 నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31 వరకూ ఈ పాదయాత్ర చేయాలని, రోజుకి 15 కి.మీ. నడవాలని చెప్పారు. భాజపా ఎంపీలు లేని ప్రాంతాల్లో రాజ్యసభ సభ్యులు, పార్టీ నాయకులు యాత్రలు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలను ఈ యాత్ర ద్వారా కలవాలని మోడీ చెప్పారు. ప్రతీ పార్లమెంటు సెగ్మెంట్ నుంచి 150 బృందాలు బయల్దేరాలన్నారు. మహాత్మా గాంధీ ఆలోచనా విధానాన్ని ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాని చెప్పారు.
నిజానికి, ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయాయి. ఇలాంటప్పుడు ఈ భారీ యాత్ర కార్యక్రమం ఎందుకు అనే ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. ప్రజల మైండ్ సెట్ ని ప్రభావితం చేసే కార్యక్రమంగా ఇది కనిపిస్తోంది. రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే జరిగిన అఖిల పక్ష సమావేశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే… జమిలి ఎన్నికలు, గాంధీ జయంతిని ఘనంగా జరపడాన్ని కీలక అంశాలుగా చర్చించారు. తాజా బడ్జెట్లో కూడా గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా గ్రామీణ భారతంపై శ్రద్ధ పెట్టామని చెప్పుకున్నారు. ఈ ప్రయత్నం వెనక… గాంధీ సిద్ధాంతాలు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంగా ఇన్నాళ్లూ ప్రజల్లో బలంగా పాతుకుపోయిన అభిప్రాయాన్ని మార్చాలనే ప్రయత్నం పరోక్షంగా కనిపిస్తోంది.
నెహ్రూ పాలనపైనా, సిద్ధాంతాలపై భాజపాకీ ఆరెస్సెస్ కీ మొదట్నుంచీ చాలా అభ్యంతరాలున్నాయి. అందుకే, గత ప్రభుత్వ హయాంలో వల్లభాయ్ పటేల్ ని ప్రముఖంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. గుజరాత్ లో భారీ ఎత్తున విగ్రహం కూడా కట్టారు. అయితే, గాంధీ సూత్రాలను, ఆదర్శాలను తామే అమలు చేస్తున్నామనేది కాంగ్రెస్ చెప్పుకుంటూ వస్తోంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసి, గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం దగ్గర్నుంచీ… ఆయన సిద్ధాంతాలకు తామే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామనే ఇమేజ్ భాజపాకి దక్కాలనే బలమైన ప్రయత్నం ఇప్పుడు కనిపిస్తోంది. నెహ్రూ బ్రాండింగ్ నుంచి దేశాన్ని పక్కకి తెచ్చి, గాంధీయన్ ఫిలాసఫీయే తమదీ అనే ముద్ర కోసం గట్టి ప్రయత్నమే భాజపా చేస్తోందనే అభిప్రాయం కలుగుతోంది. ఇంకోటి, గాడ్సే అంశం ఎప్పుడు తెరమీదికి వచ్చినా.. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నుంచి భాజపా బయటపడే ప్రయత్నంగానూ ఇది కనిపిస్తోంది.