ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ మరింత ఒంటరిగా మారిపోతోంది. ఎన్డీఏలో పేరుకు 42 పార్టీలు ఉన్నాయి. కానీ అందులో సీట్లు ఉన్నది ఎనిమిది పార్టీలకే. అందులో ఆరు పార్టీలకు ఉంది ఒక్కటే సీటే. శివసేనకు మాత్రమే డబుల్ డిజిట్ సీట్లు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రెండు అంకెల్లో సీట్లు గెలుచుకోగల సామర్థ్యం ఉన్న పార్టీల్లో శివసేన, జేడీయూ మాత్రమే.
ఎన్డీఏలో పార్టీలు 42 – సీట్లున్న పార్టీలు ఎన్ని..?
శివసేన చాలా రోజుల నుంచి బీజేపీతో టచ్ మి నాట్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. బీజేపీకి అందనంత దూరం పోతోంది. ఒంటరి పోటీకి ఎప్పుడో తీర్మానం చేసింది. అంటు కేంద్ర ప్రభుత్వంలోనూ.. ఇటు మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉన్నప్పటికీ.. ప్రధానమంత్రి అమిత్ షాపై.. నేరుగా విమర్శలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని పొగుడుతున్నారు. కొన్ని రోజుల నుంచి ఈ వార్ ఆఫ్ వర్డ్స్ రెండు పార్టీల మధ్య పెరిగిపోయింది. చివరికి.. అమిత్ షా… ఒంటరిగా పోటీ చేద్దామని.. పార్టీ నేతలకు సూచించారు. దీనికి శివసేన కూడా కౌంటర్ ఇచ్చింది. మహారాష్ట్రలో బీజేపీకి నూకలు చెల్లిపోయాయని ప్రకటించేసింది. ఈ రెండు పార్టీల మధ్య పరిస్థితి.. నరేంద్రమోదీ, అమిత్ షా చేతుల్లో బీజేపీ ఉన్నంత వరకూ సాధ్యం కాదని తాజా పరిణామాలతో తేలిపోయింది. ఒక వేళ ఆరెస్సెస్ పెద్దలు కల్పించుకుని పోటీ చేయలని రెండు పార్టీల మధ్య రాజీ చేస్తే.. బీహార్ లో చేసినట్లు.. శివసేన కోసం సిట్టింగ్ సీట్లు త్యాగం చేసి.. మహారాష్ట్రలో కూటమిలో జూనియర్ పార్టనర్ గా .. బీజేపీ ఉండటానికి సిద్ధపడాలి. లేపోతే.. శివసేన దిగి వచ్చే ప్రశ్నే లేదు.
ఒక్క బిల్లుతో ఈశాన్యం అంతా వ్యతిరేకం..!
శివసేన బయటకు వెళ్లితే.. ఇక మిగిలే ఓ మాదిరి పార్టీ.. జేడీయూ మాత్రమే. ఈ జేడీయూకి.. బీహార్ లో గత పార్లమెంట్ ఎన్నికల్లో రెండంటే రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల్లో మోడీతో జట్టుకట్టి మునిగిపోతున్నామనే భావనకు వస్తే.. నితీష్ కుమార్ బీజేపీకి గుడ్ బై చెప్పినా ఆశ్చర్యం లేదన్న విశ్లేషణలు అడపాదడపా వస్తున్నాయి. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని మిత్రపక్షం అప్నాదళ్.. బీజేపీ అవమానిస్తోందని మండి పడుతోంది. ఎస్పీ, బీఎస్పీలు తమ సిట్టింగ్ సీట్లు తమకు ఇచ్చినా… వారు.. ఆ కూటమి వైపు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే అసోంలో పౌరసత్వ బిల్లు విషయం అసోం గణపరిషత్ బీజేపీపై తీవ్ర నిరసన వ్యక్తం చేసి కూటమి నుంచి వైదొలిగింది. పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. దీన్ని ఖండిస్తూ.. ఏజీపీ బయటకు వచ్చేసింది. ఆ పార్టీ వెళ్లిపోవడం వల్ల.. అసోంలో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పు లేదు కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపించడం ఖాయమే..!. ఏజీపీ ఒక్కటే కాదు.. ఈశాన్య రాష్ట్రాల్లో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు.. బీజేపీకి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నాయి. పట్టు నిలుపుకుంటామని ఆశ పడుతున్న బీజేపీకి.. ఈ పరిణామాల ఈశాన్యంలోనూ జెల్లకొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే.. ఈ పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయి
ఎన్నికల తర్వాత కూడా ఏ పార్టీ బీజేపీ వైపు రాదా..?
కాంగ్రెస్ పార్టీ కాస్త తగ్గి అయినా మిత్రులను చేసుకోవాలని చూస్తోంది. కానీ భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు మాత్రం.. మరింత పెరిగి.. ఇప్పటి వరకూ విధేయంగా ఉన్న మిత్రులను బలవంతంగా వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పైగా వచ్చే ఎన్నికల తర్వాత అసలు భారతీయ జనతా పార్టీ వైపునకు రాకుండా… చేసుకుంటున్నారు. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీతో రాజకీయ వైరాన్ని.. మోదీ, అమిత్ షాలు అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను.. పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే.. ఓ ఎంపీకి బీజేపీ కండువా కప్పిన బీజేపీ నేతలు.. మైండ్ గేమ్ ప్రారంభించారు. మరో నలుగురైదుగురు ఎంపీలు … మమతా బెనర్జీకి గుడ్ బై చెప్పి వస్తారంటూ.. ప్రచారం ప్రారంభించారు. బీజేపీతో జట్టుకట్టి బయటకు వచ్చేసిన ఏ పార్టీ కూడా.. ఎన్నికల తర్వాత మళ్లీ ఆ పార్టీ దగ్గరకు వెళ్లదని మాత్రం చెప్పవచ్చు. మోదీ, అమిత్ షా లీడ్ రోల్స్ లో ఉంటే.. ప్రాంతీయ పార్టీలు.. ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ వైపైనా వెళ్తాయి కానీ.. బీజేపీ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది.
— సుభాష్