కేంద్ర ప్రభుత్వం చంద్రబాబును ఘోరంగా అవమానించాలని ప్లాన్ చేసిందా..? చివరి నిమిషంలో ఏపీ ప్రభుత్వం గుర్తించడంతో సర్దుకున్నారా..? నిన్నంతా విజయవాడలో జరిగిన పరిణామాలు చూస్తే అవుననిపించక మానదు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రారంభోత్సవం, స్నాతకోత్సవంలో అసలు ఏపీ ప్రభుత్వఉనికే లేకుండా… కేంద్ర అధికారులు ఏర్పాట్లు చేశారు. శిలాఫలకంపై పేర్లు కాదు కదా.. అసలు… ఏపీలో ప్రభుత్వమే లేదన్నట్లుగా వ్యవహరించారు. చివరికి లెంపలేసుకున్నారు.
విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థను గతంలోనే స్థాపించారు. అప్పట్లో నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలికంగా నడిపారు. తర్వాత విజయవాడలో ఐటిఐ కళాశాలలో ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిధులతో ఈ కళాశాల క్యాంపస్ ను నిర్మించారు. అయితే దీని ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించలేదు. ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడంపై ఉపరాష్ర్టపతి కార్యాలయంతో పాటు గవర్నర్ కార్యాలయం కూడా ఆరా తీసింది. చంద్రబాబుకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున.. ఆహ్వానించలేదనే సమాధానం వరారికి వచ్చింది. అయితే భవనాల ప్రారంభోత్సవానికి సంబంధిత ఎమ్మెల్యే, జిల్లా మంత్రుల పేర్లు కూడా ఆహ్వాన పత్రికలో లేవు. దీంతో కావాలనే చేసినట్లు తేట తెల్లమయింది.
ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేతలు.. పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్‌ను మేయర్ కోనేరు శ్రీధర్ ప్రశ్నించారు. ఆ తర్వాత ఆహ్వాన పత్రికల్లో… ఎంపీ, ఎమ్మెల్యే పేరును చేర్చిన కేంద్ర మానవ వనరుల శాఖ అధికారులు చేర్చారు. కొత్త శిలాఫలాకాన్ని ఏర్పాటు చేశారు. గద్దే రామ్మోహన్, ఎంపీ కేశినేనికి ఫోన్‌చేసి ఆహ్వానంపై సమాచారం ఇచ్చారు. ఏపీని కావాలనే అవమానిస్తున్నారన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నల్ల జెండాలతో నిరసన తెలపాలని టీడీపీ ప్రజాప్రతినిధులు భావించారు.