కేంద్రంలో మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. ప్రభుత్వాల కూల్చివేతకు ఉపక్రమించే అవకాశం లేదని బీజేపీయేతర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో బీజేపీపై ఆ రాష్ట్ర మంత్రి సతీష్ జార్ఖిహోలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఇబ్బందులు ఎదురైతే తర్వాత తెలంగాణ సర్కార్ పతనం ప్రారంభం అవుతుందని బిగ్ బాంబ్ పేల్చారు. సిద్దరామయ్యపై అవినీతి కేసుల విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
సిద్దరామయ్యను బలహీనపరిస్తే కాంగ్రెస్ సర్కార్ పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఈ విధమైన కుట్రలు చేస్తోందన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రయత్నాలు సక్సెస్ అవుతే బీజేపీ టార్గెట్ తెలంగాణే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో తెలంగాణ బీజేపీ నేతలు కూడా రాష్ట్రంలో ఆగస్ట్ సంక్షోభం తప్పదని హెచ్చరించారు. కానీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నుంచి ఆ తరహ ప్రకటనలు రావడం లేదు. కర్ణాటక ఎపిసోడ్.. ఆ రాష్ట్ర మంత్రి సతీష్ జార్ఖిహోలీ వ్యాఖ్యలతో తెలంగాణపై కూడా బీజేపీ గురి పెట్టిందా..? అనే చర్చ మరోసారి ప్రారంభమైంది.
బీజేపీ ప్రయత్నాలను ముందే అంచనా వేసిన రేవంత్ తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి చేరికలను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ సర్కార్ కూల్చివేతకు బీజేపీ ఉపక్రమిస్తే ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. సో, తెలంగాణ సర్కార్ కు ఇప్పట్లో వచ్చిన డోఖా ఏమి లేదంటున్నాయి రాజకీయ వర్గాలు.