తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీది ఓ భిన్నమైన శైలి. లీడర్లు, క్యాడర్లు లేకపోయినా మేమే గెలిచేయబోతున్నామని..ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్నామని ఘనంగా ప్రకటనలు చేస్తూ ఉంటారు. కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉండటమే దీనికి కారణం. ఆ అధికార దన్నుతో ఇక్కడా విస్తరించుకోవాలని ఆ పార్టీ నేతలు చాలా ప్రయత్నం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్లాన్లు కాస్త వర్కవుట్ అవుతున్నాయనుకున్న సమయంలో.. కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ఏపీలో జనసేన మద్దతు కలిసి వచ్చింది. ఈ క్రమంలో… తెలంగాణలో నాగార్జున సాగర్, ఏపీలో తిరుపతి ఉపఎన్నికలు జరిగాయి. రెండింటిలోనూ.. ఆ పార్టీ రేసులో ఉందని .. గెలిచేస్తారన్నట్లుగా మొదట్లో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బీజేపీ ఆ మేరకు మెయిన్‌టెయిన్ చేసింది. కానీ.. అసలు సీన్లోకి వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది.
నాగార్జునసాగర్, తిరుపతిల్లో పోలింగ్ ట్రెండ్స్‌ను చూస్తే.. బీజేపీ ఎ దేశలోనూ ఎక్కడా ప్రభావం చూపించినట్లుగా వెల్లడి కావడం లేదు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపీకి రెండువేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి వాటి కంటే ఎక్కువ రావడం అసాధ్యమన్న చర్చ జరుగుతోంది. జనరల్ స్థానంలో ఎస్టీ అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ.. లంబాడీల విషయంలో బీజేపీ విధానం.. ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకతకు కారణం అయింది. ఫలితంగా అభ్యర్థి సామాజికవర్గం ఓట్లు కూడా బీజేపీకి పడలేదని చెబుతున్నారు. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ హోరాహోరీగా పోరాడటం.. పోటీ కూడా ఆ రెండు పార్టీల మధ్యే ఉంటుందని తేలడంతో… బీజేపీని ప్రత్యామ్నాయంగా భావించి ఆ పార్టీ వైపు మొగ్గు చూపేవారు తగ్గిపోయారు. ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మూకుమ్మడిగా పడినట్లుగా తెలుస్తోంది. ఎలా చూసినా సాగర్‌లో బీజేపీ దుబ్బాకలో చూపిన పోరాటపటిమలో సగం కూడా చూపించలేకపోయింది.
ఇక తిరుపతిలో జనసేన మద్దతు ఉన్నప్పటికీ.. కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందా అన్న సందేహాలు ఆ పార్టీ క్యాడర్లోనే ప్రారంభమయ్యాయి. పవన్ కల్యాణ్ సామాజికవర్గ ఓటర్లు మద్దతిచ్చినట్లుగా .. పోలింగ్ సరళిలో బీజేపీ నేతలకు నమ్మకం కలగలేదు. అదే సమయంలో… పోలింగ్ ఏజెంట్లే చాలా చోట్ల కరువయ్యారు. మోడీ వేవ్‌తో ఓట్లు వస్తాయని వారు ఆశ పెట్టుకున్నారు కానీ అలాంటి పరిస్థితి ఏమీ లేదని తేలిపోయింది. తిరుపతిలో బీజేపీ ఎడెనిమిది శాతం ఓట్లు అయినా తెచ్చుకోకపోతే… జనసేన పార్టీ.. బీజేపీతో పొత్తు గురించి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్రంలో అధికారం ఉందన్న ధైర్యంతో ఇష్టం వచ్చినట్లుగా రాజకీయం చేసిన బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో మే రెండో తేదీన మరోసారి ఇబ్బంది కర పరిస్థితుల్ని తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.