కేంద్రానికి అంశాల వారీ మద్దతిస్తామని టీడీపీ మహానాడులో తీర్మానం చేసింది. మద్దతిస్తామని చెప్పినందుకు సంతోషపడాల్సిన కొంత మంది బీజేపీ నేతలు… వైసీపీ నేతల వాయిస్‌ను .. తమ పార్టీ తరపున వినిపించడం ప్రారంభించారు. టీడీపీ అలా తీర్మానం చేసిందంటే.. మళ్లీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తోందన్న విశ్లేషణను వైసీపీ నేతలు చేసి… టీడీపీ పై మండిపడటం ప్రారంభించారు. వారంటే.. టీడీపీకి ప్రత్యర్థి కాబట్టి అలా చేస్తారని అనుకుంటారు.. కానీ.. కొంత మంది బీజేపీ నేతలు కూడా.. అదే పద్దతిలో విమర్శలు ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్‌తో పాటు… ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా రంగంలోకి వచ్చారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వాదించడం ప్రారంభించారు.
టీడీపీని అడ్డగోలుగా విమర్శిస్తూ.. ఆ పార్టీతో పొత్తేంటి అంటున్నారు. నిజానికి ఏపీలో ఉన్న పరిస్థితులతో బీజేపీతో ఎవరైనా పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. కానీ కేంద్రంలో ఉన్న పార్టీగా.. ఆ పార్టీకి .. మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్న సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల భయం కారణంగా… చాలా రాజకీయ పార్టీలు అణిగిమణిగి ఉంటున్నాయి. ఎవరూ ఎదురు చెప్పడం లేదు. నిజంగా… ఆ మిత్రపక్షాలు స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించిన రోజున.. బీజేపీపై తిరగబడే పార్టీలు దేశంలో 90 శాతం ఉంటాయి. ఈ విషయం తెలిసో తెలియదో కానీ.. అసలు పొత్తులు పెట్టుకుంటామని కూడా చెప్పని టీడీపీపై… ఒంటికాలి మీద లేస్తున్నారు. వైసీపీ నేతల ఆలోచనలకు తగ్గట్లుగా వారు ప్రకటనలు చేస్తున్నారు.
తిరుపతి ఉపఎన్నికల్లో పట్టుబట్టి మరీ జనసేన మద్దతుతో బరిలోకి దిగిన బీజేపీ.. డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. ఈ కారణంగా జనసేన బలం కూడా తక్కువేనని వారు నిరూపించినట్లయింది. బీజేపీకి అంతో ఇంతో అడ్వాంటేజ్ ఉండేది.. లోక్ సభ ఎన్నికల్లోనే. అక్కడ మోడీ బొమ్ము ప్రధానంగావాడుకోవచ్చు. అలాంటి ఎన్నికల్లోనూ కనీస ప్రభావం చూపలేని బీజేపీ.. అధికార పార్టీ వ్యూహాలకు తగ్గట్లుగా వ్యవహరిస్తూ.. మిత్రపక్షం జనసేనను సైతం నిర్వీర్యం చేస్తోంది. అందులో భాగంగానే కొత్త వ్యూహాన్ని జీవీఎల్, సునీల్ ధియోధర్ అమలు చేస్తున్నారని అంటున్నారు.