ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీ ప్రభుత్వ అక్రమాలపై దూకుడుగా ఉన్నారు. అయితే ఆమెపై వైసీపీ నేతలు చేస్తున్న ఎదురుదాడి రొటీన్ గా ఉంది. గతంలో అమిత్ షా, జేపీ నడ్డాలు విమర్శిస్తే వారివి టీడీపీ స్క్రిప్టులు అన్నట్లే ఇప్పుడు పురందేశ్వరిని టీడీపీ ఖాతాలో వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే టీడీపీకి పని చేయడం అని.. ఆమె మరిది కోసం పని చేస్తున్నారని ఒకరి తర్వాత ఒకరు కుటుంబపరమైన విమర్శలు చేస్తూ తెరపైకి వస్తున్నారు.
ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఎదురుపడి చేతులు కట్టుకునే విజయసాయిరెడ్డి ఏపీకి వచ్చే సరికి ఆ పార్టీ అధ్యక్షురాల్ని.. బీజేపీని కూడా కించ పరుస్తున్నారు. బీజేపీ అంటే బాబు జనతా పార్టీ అంటున్నారు. ఈ వ్యవహారాలు .. బీజేపీ ని మరింతగా చులకన చేస్తున్నాయి. ఏపీ బీజేపీ నేతల్ని ఘోరంగా విమర్శిస్తున్నా ఎందుకు బీజేపీ పెద్దలు.. సీరియస్ గా తీసుకోరనే సందేహం సహజంగానే వస్తోంది. ఓ అవినీతి పరుడ్ని సమర్థిస్తున్నారనే నిందలకు తోడు.. సొంత పార్టీని నేతల్ని అగౌరవపరుస్తున్నా ఏమీ అనలేని స్థితికి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారు.
అంతగా కావాలనుకుంటే వైసీపీ కనుసన్నల్లో పని చేసే వారినే ఇంచార్జిగా పెట్టుకుని ఉంటే సరిపోతుందనే వాదన ఆ పార్టీలోని కొన్ని వర్గాల్లో వినిపిస్తోంది. ఓ వైపు అప్పుల విషయంలో అడ్డగోలుగా సహకరిస్తూ. వేల కోట్లు తెచ్చుకుని దుబారా చేయడం కళ్ల ముందు కనిపిస్తూంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీగా ప్రశ్నించకపోతే ఇక రాజకీయాలు ఎందుకని అంటున్నారు. ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ వ్యూహమేంటో తెలియాల్సి ఉంది.