ఎంత చెడ్డా సరే.. మిత్రధర్మం అంటూ ఒక ముసుగు వేసుకుని రాజకీయాలు నడుపుతూ ఉంటే కొంత ఎడ్వాంటేజీ ఉంటుంది. ఆ ముసుగులో కొన్ని పరాజయాలను, అవమాన భారాలను తప్పించుకుంటూ ఉండవచ్చు. అయితే ఎవరికి వారే అన్న తీరుగా పార్టీలు వ్యవహరించడం వలన ఎవరికి వారే అవమానాల్ని కూడా మోయాల్సి ఉంటుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి అచ్చంగా అలాగే తయారైంది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక విషయంలో.. వారు తెదేపాకు మిత్ర పక్షం గనుక, ఆ రకంగా తప్పించుకుని ఉంటే బాగుండేది. పోటీ గురించి పార్టీలో చర్చించి.. ఢిల్లీ పెద్దలతో కూడా చర్చించి.. చివరకు ‘పోటీచేయం’ అని ప్రకటించడం అంటే.. ఓటమికి భయపడుతున్నారనే తప్పకుండా అర్థమవుతుంది.
ఉప ఎన్నికలు వంటివి వచ్చినప్పుడు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎలాగైతే సీట్లు పంచుకున్నారో అదే మాదిరిగా ఆ పార్టీలే ఉప ఎన్నికల్లో కూడా పోటీచేయాలనేది భాజపా- తెదేపాల మధ్య ఉన్న అప్రకటిత ఒప్పందం. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అలాగే పోటీచేశారు. ఆ ధర్మం ప్రకారం.. పాలేరును వదిలేశాం అని భాజపా ఒక్కమాటతో తేల్చేసి ఉంటే వారికి చాలా పరువుగా ఉండేది. కానీ ఆ పార్టీ కాస్త భేషజాలకు పోయింది. కాంగ్రెస్కు మద్దతు ఇస్తాం అని తెదేపా ప్రకటించిన తరువాత కూడా.. వారితో తమకు సంబంధమే లేనట్లుగా.. కేంద్ర నాయకత్వంతో మాట్లాడి డిసైడ్ చేస్తాం అని ప్రకటించి, చివరికి పోటీచేయడం లేదు, ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు అని చెప్పి ఊరుకుంది.
నిజానికి ఖమ్మం జిల్లాలో భాజపాకు ఉన్న బలం తక్కువ. ఆ సంగతి వారు గుర్తించకుండా.. తెదేపా వల్లనే తాము సమస్తం నష్టపోతున్నట్లుగా.. గత మునిసిపల్ ఎన్నికల్లో విడివిడిగా బరిలోకి దిగి దారుణంగా చేతులు కాల్చుకున్నారు. అప్పటికీ వారికి జ్ఞానోదయం అయినట్లు లేదు. పాలేరు ఉప ఎన్నికలో మిత్రధర్మంతో నిమిత్తం లేకుండా పోటీనుంచి తప్పుకుంటున్నాం అని ప్రకటించడం ద్వారా.. మరో మారు భాజపా భయాన్ని చాటుకున్నట్లయింది.