ఆంధ్రప్రదేశ్ బీజేపీ పెద్దలకు కేంద్ర నేతలు ఏం చెబుతున్నారో కానీ.. వారికి మాత్రం తమ పార్టీపై ఉన్న వైసీపీ ముద్ర చెరిపేసుకునే ఆసక్తి మాత్రం కనిపించడం లేదు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగినా.. మరొకటి జరిగినా…. బీజేపీ సమావేంలో మొదటగా జరిగే చర్చ ప్రభుత్వంపై పోరాటం. తమపై వైసీపీ ముద్ర ఉందని… దాన్ని చెరిపేసుకోవాలని అనుకోవడం. సోమవారం జరిగిన వర్చువల్ కార్యవర్గ భేటీలోనూ అలాగే నిర్ణయించుకున్నారు. బీజేపీ, వైసీపీ అంతర్గతంగా ఒక్కటే కాదన్న భావనను ప్రజల్లో కలిగించేందుకు కృషి చేసి, ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సంస్ధాగతంగా పటిష్టం కావాలని తీర్మానించుకున్నారు. కానీ దాని కోసం ఏం చేయాలన్నదానిపైనేవారికి స్పష్టత లేదు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని.. సమావేశంలో పాల్గొన్న అందరూ చెప్పారు. ఏపీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమయిందని.. సోము వీర్రాజు కూడా గర్జించారు. ఇక రోడ్డెక్కాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. రాజకీయ తీర్మానంలో కూడా అలాగే ఉంది. కానీ..ఇది గత రెండేళ్లుగా చేస్తున్న ప్రకటనలే. ఒక్కరంటే ఒక్కరూ రోడ్డెక్కి ఏపీసర్కార్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పాపాన పోలేదు. ఇంకా చెప్పాలంటే.. సర్కార్ పై ఘాటు విమర్శలు చేస్తున్నవారిని పార్టీ నుంచి సాగనంపేస్తున్నారు. లేకపోతే సైలెంటయ్యేలా హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో బీజేపీలోనే.. వైసీపీ ఉందని… వారిదే పైచేయి అవుతోందని అంటున్నారు.
నిజానికి బీజేపీలోకొంత మంది గతంలో ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. కన్నా లక్ష్మినారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి వారందరూ వైసీపీసర్కార్ పై విరుచుకుపడేవారు. అయితే వైసీపీని విమర్శిస్తే.. టీడీపీకి లాభం అవుతుందని.. వారందరూ టీడీపీ కోసం పని చేస్తున్నరంటూ.. వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఇలాంటి ప్రచారంతోనే విజయసాయిరెడ్డి బీజేపీపై పట్టు సాధించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు… ఏపీ బీజేపీ అగ్రనేతలు విజయసాయిరెడ్డి గుప్పిట్లో ఉన్ారని అంటున్నారు. అందుకే కేంద్ర ఆలోచనలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు… రాజీలేని పోరాటం అంటారు కానీ.. దాన్ని ప్రారంభించరు. అందుకే బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.