“మింగమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం..” అనే సామెత రాముడి గుడి విషయంలో .. భారతీయ జనతా పార్టీ పరిస్థితికి పక్కాగా సరిపోతోంది. ఐదేళ్ల పాటు అధికారం చెలాయించి.. దేశానికి చేసిన మంచిని చెప్పుకుని ఓట్లడగాల్సిన పరిస్థితిలో బీజేపీ లేదు. ఐదేళ్లలో దేశంలో అత్యంత సామాన్యుడి దగ్గర్నుంచి ప్రతి ఒక్కర్నీ ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుని.. ” ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడితే… భవిష్యత్ బంగారం” అని కబుర్లు చెప్పారు. కానీ రాను రాను భవిష్యత్ కనిపించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇది… ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనే కాదు.. ఉపఎన్నికల్లో కూడా బయటపడింది. అందుకే బీజేపీ వ్యూహకర్తలు మళ్లీ రాముడి అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు.
కొద్ది రోజులుగా.. బీజేపీ సిద్ధాంతకర్తలు.. మెల్లగా రాముడ్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న పళంగా ఆలయాన్ని నిర్మించడానికి ఆర్డినెన్స్ తేవాలంటూ.. బీజేపీని శాసించే .. హిందూ సంస్థలు ఓ ఉద్యమాన్ని ప్రారంభించాయి. వారానికో కార్యక్రమాన్ని అయోధ్యలో పెట్టి.. అలజడి రేపుతున్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీకి రాజకీయంగా చాలా ఇబ్బందికర పరిణామాలు వచ్చి పడుతున్నాయి. సొంతగా పార్టీలో .. ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా… కొన్ని రాష్ట్రాల్లో తాము ఆధారపడిన మిత్రపక్షాలు .. కొత్త కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. కొంత మంది రాముడి మాటెత్తితే గుడ్ బై చెబుతామని అంటున్నారు. మరికొంత మంది… రాముడి గుడి కట్టకపోతే… సంగతి తేలుస్తామంటున్నారు. ఈ రెండు వర్గాలను సమన్వయం చేయడానికి.. బీజేపీకి సమయం కుదరడం లేదు.
బీహార్లో బీజేపీ మిత్రపక్షాలు.. జేడీయూ, రామ్ విలాస్ పాశ్వాన్లు.. నిన్ననే సీట్ల ఒప్పందం చేసుకున్నారు. ఆల్ ఈజ్ వెల్ అనుకున్న సమయంలో వారొ ప్రకటన చేశారు. రామమందిరం ఇష్యూని తెర మీదకు తెస్తే మాత్రం తమ దారి తాము చూసుకుంటామని చెప్పకనే చెప్పారు. బీహార్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. అలా చేస్తే.. ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావు. ఇక మహారాష్ట్రలోని మిత్రపక్షం శివసేన మాత్రం.. రామాలయం ఎప్పుడు కడతారంటూ.. కత్తి దూస్తోంది. బీజేపీపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తోంది. ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తోంది. ఉన్న పళంగా ఆర్డినెన్స్ జారీ చేసి ఆలయ నిర్మాణం ప్రారంభించాలంటోంది. బీజేపీకి కటీఫ్ చెప్పడానికి శివసేన ఇదో కారణంగా ఎంచుకుంటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి తమను పెంచి పెద్ద చేసిన రాముడే.. ఇప్పుడు.. తుంచేయబోతున్నాడనే ఆందోళన… బీజేపీ వర్గాల్లో కనిపిస్తోంది.