తెలంగాణలో టిడిపితో తమ మైత్రి ముగిసినట్టే నని బిజెపి అధికార ప్రతినిధులు అనేకసార్లు చెప్పారు. సాక్షాత్తూ రాష్ట్ర పార్టీ అద్యక్షుడు డా.కె.లక్ష్హణ్ ఆ మేరకు ప్రకటన చేశారు కూడా.కిషన్‌రెడ్డి చాలాసార్లు చెప్పారు.తమాషా ఏమంటే ఇంతమంది ఇన్నిసార్లు చెబుతున్నా తెలంగాణ తెలుగుదేశం మాత్రం చూరుపట్టుకుని వేళ్లాడుతూనే వుంది. తెగతెంపులై పోయాయని వారు అంటుంటే విననట్టు నటిస్తున్నది. ఎపి ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఇటీవల జరిగిన సమావేశంలో ఆయన ఎన్నికలు ఇంత దూరంలో వుండగా పొత్తుల చర్చ వద్దని చెప్పారట. ఈ నెల 22-24తేదీల మధ్య బిజెపి జాతీయ అద్యక్షుడు అమిత్ షా వచ్చినప్పుడు ఇలాటి అంశాలు ఖరారు చేసుకుంటారని అందరికీ తెలుసు దక్షిణ భారత దేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణ తమకు అనుకూలమని బిజెపి భావిస్తున్నది. తమిళనాడులోనూ రజనీ కాంత్ వస్తే గెలిచినట్టేనని చెప్పుకుంటున్నది.తెలంగాణలో మరీ ముఖ్యంగా ఓటుకు నోటు తర్వాత టిడిపితో వెళితే నష్టమే తప్ప లాభం లేదనుకుంటున్నట్టు ఆ పార్టీ నాయకులు అంటూనే వున్నారు. జాతీయ నాయకత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది గనకే ఆ సంగతి బాహాటంగా ప్రకటించారు. అమిత్ షా మూడు రోజుల పర్యటన కూడా క్షేత్రస్థాయిసమస్యల పరిశీలనకు వెచ్చిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ కోసం పనిచేసేవారికి టూ వీలర్లు ఇస్తున్నారు. ఇవి కూడా యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పంపిస్తున్నారట. మోడీ స్వంత నియోజకవర్గమైన వారణాసిలో కొనుగోలు చేశారు. యాభై నియోజకవర్గాలనైనా గెలుచుకోవాలని బిజెపి ఆశపడుతున్నది. కాంగ్రెస్ టిడిపిలలో అసంతృప్త వాదులనే గాక అధికార పార్టీలో ఆశాభంగం పొందిన వారిని కూడా ఆదరిస్తే ఒక ప్రాతిపదిక ఏర్పడుతుందని బిజెపి ఆశ. అలా వచ్చే వారి జాబితా ఒకటి చేసుకున్నారు. టిడిపి ఫైర్‌బ్రాండ్ అయినాచిక్కుల్లో చిక్కిన రేవంత్ రెడ్డి కూడా చేరడానికి సిద్ధంగా వున్నారు గాని తన వాళ్లు ముప్పై మంది వరకూ టికెట్టివ్వాలని, తనకు రాష్ట్రవ్యాపితంగా ప్రచారం చేసే అవకాశమివ్వాలని అడిగారట. మొదటి కోర్కెను ఒప్పుకున్నా రెండవ కోర్కెకు బిజెపి అధిష్టానం సిద్ధంగా లేదు. ముందు వచ్చి చేరితే తర్వాత ఎవరు ఏమిటో మేము నిర్ణయిస్తాము గాని మీకు మీరే ముఖ్యమంత్రిగా వూహించుకుని ప్రకటించమంటే కుదరదని రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వంటివారికి సమాధానమిచ్చారు.
ఇంత పకడ్బందీగా వారు వెళుతుంటే తాము ఎటూ కాకుండా అయిపోతామనే ఆందోళన టిటిడిపి నేతలను పట్టుకుంది. కావాలంటే బిజెపి కమలం గుర్తుపైనే మనం కూడా పోటీ చేద్దామని కొందరు గట్టిగానే సూచిస్తున్నారు. అప్పుడైతే ఎన్‌డిఎ ముసుగులో జరిగిపోతుందని వారి వాదన. దీనికి చంద్రబాబు ఒప్పుకోవడం అటుంచి బిజెపి ఎలా స్పందిస్తుందో చూడాలి. పొత్తులపై తర్వాత చూద్దామని దాటేశారంటే అర్థం హడావుడి అవసరం లేదని, లోలోపల పెద్ద నమ్మకం లేదని చెప్పుకోవచ్చు.జగన్ మోడీ భేటీ ప్రభావం కూడా తెలంగాణపై పడుతుంది. ఈ నీరసం నుంచి బయిటపడటానికి మహానాడు తలపెట్టారు గాని తమ పరిస్థితి బాగా లేదని టిడిపి నేతలకు తెలుసు. కాకుంటే చంద్రబాబు తెంచేసుకున్నట్టు వారు చేయలేకపోతున్నారు. అంతే తేడా.లేకపోతే ఒక పాలక పార్టీకి ఇంతకన్నా తలవంపులు ఏముంటుంది?