భారతీయ జనతా పార్టీ తెలంగాణలో… బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. టీఆర్ఎస్లో అంతర్గత రాజకీయాల్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. రెండు రోజుల క్రితం టీఆర్ ఎస్ సీనియర్ నేత ,రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో పాటు పలువురు కార్పోరేటర్లు కమలం గూటికి చేరారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ అమిత్ షాను కలవటం మరింత చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో.. నలుగురు ఎంపీలు… బీజేపీలోకి వెళ్లబోతున్నారనే చర్చ తెలంగాణలో ప్రారంభమయింది.
నలుగురు టీఆర్ఎస్ ఎంపీలు తమకు టచ్ లో ఉన్నారంటూ బీజేపీ సీనియర్ నేత బండారు దత్తా త్రేయతో పాటు.. ఇతర నేతలు పదేపదే మాట్లాడుతున్నారు. ఈ కామెంట్స్ టీఆర్ ఎస్ లో అలజడి రేపుతున్నాయి. నిజంగానే ఎంపీలు బీజేపీకి టచ్ లో ఉన్నారా.. లేక బీజేపీ ఆడుతున్న మైండ్ గేమా అన్న చర్చ మొదలైంది. టిఆర్ఎస్ లో గెలిచినవారు కొంతమంది కొత్త వారు. ఎన్నికల ముందే టీఆర్ఎస్ లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. దీంతో వారు బిజెపి వైపు చూస్తున్నారనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్లో ఉన్న వ్యాపారవేత్తలపై అందరి దృష్టి పడింది. టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు… వ్యాపార ప్రయోజనాల కోణంలోనే బీజేపీలో చేరారని నమ్ముతున్న టీఆర్ఎస్ నేతలు… తమ ఎంపీ వ్యాపారవేత్తలపై కన్నేశారు.
టిఆర్ఎస్ లో బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి , నామా నాగేశ్వరరావు లాంటి బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం కరుణాకటాక్షలు కచ్చితంగా కావాలి. లేకపోయినా పర్వాలేదు.. ఆగ్రహానికి మాత్రం గురి కాకూడదు. టీఆర్ఎస్ పై ఇప్పుడు బీజేపీ మరో విధంగా ఆలోచిస్తోంది. అందుకే వీరు ఆందోళనకు గురవుతున్నారని చెబుతున్నారు. దీన్నే బీజేపీ.. పక్కాగా ఉపయోగించుకుంటోంది. బిజెపి ప్రయత్నాలపై గులాబీ పార్టీ ముఖ్య నేతలు సైతం ఆరా తీస్తున్నారు.