పవన్ కల్యాణ్ టీడీపీతో వెళ్లకుండా బీజేపీ చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమతో ఉంటే సీఎంను చేస్తామని చంద్రబాబుతో వెళ్తే ఎప్పటికీ సీఎం కాలేరన్న సందేశాన్ని పంపుతున్నారు. అసలు ఓట్లు, సీట్లే ఉండవు.. ఇక సీఎంను ఎలా చేస్తారని పవన్ కు సందేహాలు ఉన్నాయేమో కానీ.. తమ రాజకీయాల గురించి తెలియదా అన్న సంకేతాలు పంపుతున్నట్లుగా రాజకీయవర్గాలు గుసగుసలాడుతున్నాయి. తాము ప్రభుత్వాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటే ఎంత సేపో పట్టదని చాలా ఉదహరణలు ఉన్నాయని చెబుతున్నారంటున్నారు.
కాపులకు సీఎం పదవి రావాల్సి ఉందని.. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో వెళ్తే్ సీఎం పదవి ఎలా వస్తుందని ఏపీ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో వెళ్తే.. సీఎం ఎవరు అనే ప్రశ్న వస్తుందని చంద్రబాబును కాదని.. పవన్ కల్యాణ్‌కు సీఎం పదవి ఇవ్వరని విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పాలనను తిరస్కరించి ప్రత్యామ్నాయంగా జగన్‌కు ప్రజలు పట్టం కట్టారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయనపై వ్యతిరేకత ఉన్నందున.. టీడీపీకి ప్రజలు పట్టం కడతారాని ఎందుకు అనుకుంటామని ఏపీ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పంజాబ్‌లో ఏం జరిగిందో ఓ సారి గుర్తు చేసుకోమని పవన్‌కు సూచిస్తున్నారు.
పంజాబ్‌లో సుదీర్ఘంగా బీజేపీ, అకాలీ కూటమి, కాంగ్రెస్ పార్టీల మధ్య అధికారం మారుతూ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు పూర్తి స్థాయిలో ఆ రెండు పార్టీల్ని తిరస్కరించారు. కొత్త ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన ఆమ్ ఆద్మీని గెలిపించారు. ఏపీలోనూ అదే పరిస్థితులు ఉన్నాయని.. ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే పైకి ఇలా చెబుతున్నా.. అంతిమంగా మాత్రం… సీఎంను చేస్తామనే నమ్మకాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ విషయంపై పవన్ కు రాజకీయంగా అవగాహన వస్తుందని… పొత్తులపై తుది నిర్ణయం తీసుకునేముందు అన్నీ ఆలోచిస్తారని.. బీజేపీతోనే కలిసి నడుస్తారని వారు నమ్మకంగా ఉన్నారు. సీఎం కోరిక పవన్ ను తమతోనే ఉండేలా చేస్తుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. హైకమాండ్ తమ మ్యాజిక్ చూపిస్తుందని ఆశ పడుతున్నారు.