భారత మాత అంటే మీకు అపారమైన ప్రేమ, భక్తి ప్రపత్తులు ఉండవచ్చు గాక.. కానీ.. భారతీయ జనతా పార్టీ మీద మీకు అసహ్యం ఉంటే ఇక మీరు జీవితంలో ’భారత్ మాతా కీ జై‘ అనకుండా ఉండే పరిస్థితిని భాజపా శ్రేణులు కల్పిస్తున్నాయి. భారతమాత అంటే అదేదో తమ పార్టీ సొత్తు అన్నట్లుగా వారు పూనిక తీసుకుని ఈ వివాదాన్ని పెద్ద పెద్ద రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది ఒక వ్యూహాత్మకమైన కుట్రగానే భావించాల్సి ఉంటుంది.
సాధారణంగా ప్రభుత్వాలలో ఏలుబడి సాగిస్తున్న పార్టీలు.. తమ వైఫల్యాల మీద నుంచి ప్రజల చూపును మరలించడానికి చాలా రకాల కుట్రలకు పాల్పడుతూ ఉంటాయి. వక్రమార్గాలను అన్వేషిస్తూ ఉంటాయి. తమ వైఫల్యాలను ప్రజలు గుర్తించేస్తారు అనిపించే సమయంలో కొత్త వివాదాలను రేకెత్తించి అందరు అటువైపు చూసేలా డ్రామాలాడుతుంటాయి. సినిమాలలో కూడా ఇలాంటి దుష్ట ప్రభుత్వాలను మనం అనేకం చూసి ఉంటాం. ఇప్పుడు మోడీ సర్కారు, ఆయన కొమ్ము కాసే భాజపా దళాలు అచ్చంగా అదే పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అసదుద్దీన్ విషయానికి వచ్చినా.. ’భారత్ మాతాకీ జై‘ అనే పదం మాత్రమే అనాలని ఎందుకు పట్టు పట్టాలి. ఆయన ’జైహింద్, జైభారత్‘ అన్నారు. ఇంకా ఆయన్ని ఎందుకు తప్పు పడతారు. కేవలం దేశానికి పనికి రాని సమాజ వికాసానికి ఎందుకూ కొరగాని ఒక వివాదాన్ని రాద్ధాంతం చేసి, రాజకీయంగా పబ్బం గడుపుకోవడం ఒక్కటే భాజపా పన్నాగంగా కనిపిస్తోంది. ఈ దేశంలో ఎర్ర రంగును కమ్యూనిస్టులు కాజేసినట్లుగా ’భారత్ మాతాకీ జై‘ అనే పదాన్ని ఆ నినాదాన్ని ఆరెస్సెస్ కాజేసింది. ఆ నినాదం తమ సొత్తుగా ఆరెస్సెస్ ప్రచారం చేసుకున్నది. ఇప్పుడు దేశం మొత్తం తమ ఆరెస్సెస్ నినాదం పలికితే మాత్రమే దేశభక్తులు అన్నట్లుగా వారు మాట్లాడడం జాతికి ద్రోహం. ఆ నినాదాన్ని ఆరెస్సెస్ తమదిగా కబ్జా చేయడం.. నిజానికి భారతమాతకు ఆ సంస్థ గానీ, భాజపా గానీ చేసిన ద్రోహంగా పరిగణించాలి. వారు వకాలత్తు పుచ్చుకోవడం వల్లనే.. వారిని అసహ్యించుకునే నిజమైన దేశభక్తులు ఎంతో మంది.. ఆ పదం అనడానికి విముఖత చూపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
తాము రెచ్చగొట్టే డైలాగులు వేయడం రాజకీయంగా తమకు లాభిస్తుందేమో గానీ.. దేశమాతకు మాత్రం ద్రోహం చేస్తున్నదని రాందేవ్ బాబాలు, భాజపా నేతలు తెలుసుకోవాలి.